YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వెంకయ్యకు తప్పని పితలాటకం

వెంకయ్యకు తప్పని పితలాటకం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఆపరేషన్ కమలం దెబ్బకు టీడీపీ సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్, గరికపాటి రామ్మోహన్ రావు బీజేపీకి గూటికి చేరారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడిని కలిసిన ముగ్గురు ఎంపీలు.. తమను బీజేపీలో విలీనం చేయాలని కోరారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లోని నాలుగో పేరాగ్రాఫ్ ప్రకారం టీడీపీ లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో కలపాలని వారు వెంకయ్యను కోరారు. బీజేపీలో చేరిన ఎంపీలు అమిత్ షా‌ను కలిసి తమను బీజేపీ సభ్యులుగా గుర్తించాలని కోరనున్నారు. మా అభ్యర్థనను అమిత్ షా స్వీకరించి.. వెంకయ్యకు సిఫారసు చేయాలని వారు బీజేపీని కోరారు. తర్వాత వెంటనే జేపీ నడ్డా సమక్షంలో వారంతా బీజేపీలో చేరారు. అమిత్ షా సిఫారసు చేయడం.. వెంకయ్య దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇక లాంఛనమే. మేం బీజేపీలో విలీనం అవుతాం, మీరు అంగీకరించండని చంద్రబాబుకి ఆప్తుడిగా పేరొందిన వెంకయ్య నాయుడిని టీడీపీ ఎంపీలు కోరడం విశేషం. పార్టీలు వేరైనప్పటికీ.. చంద్రబాబు, వెంకయ్య నాయుడి మధ్య 1995 నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇరు పార్టీల మధ్య పొత్తులో వెంకయ్య కీలక పాత్ర పోషించారు. ఆయన వల్లే ఏపీలో బీజేపీ బలపడలేదనే వాదన కూడా లేకపోలేదు. కేంద్రంలో కీలక మంత్రిగా ఉన్న వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా పంపిన తర్వాత ఆయనకు ఏపీ రాజకీయాలతో సంబంధం తెగిపోయింది. అప్పటికే బీజేపీకి దగ్గరయ్యేందుకు ఉత్సాహంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కమలం పార్టీకి మరింత దగ్గర కావడం, టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోవడం జరిగాయి. వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవిని కట్టబెట్టగానే.. టీడీపీలో సంతోషం కంటే కలవరమే ఎక్కువగా కనిపించింది. చంద్రబాబుకి, టీడీపీకి ఇబ్బందులు తప్పవేమోనని చాలా మంది అప్పుడే అంచనా వేశారు. 2019 ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక.. ఏపీపై ప్రధానంగా ఫోకస్ పెట్టిన బీజేపీ.. టీడీపీ నేతలను తమవైపు తిప్పుకునేందుకు పాచిక వేసింది. రాంమాధవ్ రంగంలోకి దిగడంతో బీజేపీ ఆకర్ష్ మొదలైంది. ఇక టీడీపీ శ్రేణులకు బాధను కలిగించే అంశం ఏంటంటే.. తమను బీజేపీలో కలిపేయండని టీడీపీ రాజ్యసభ సభ్యులు రాజ్యసభ చైర్మన్ అయిన వెంకయ్యకు వినతి పత్రం సమర్పించడం. బాబుతో అనుబంధం ఓవైపు.. పార్టీ ప్రయోజనాలు మరోవైపు.. ఈ రెండు అంశాల మధ్య సంఘర్షణలోనే వెంకయ్య ‘తప్పనిసరి పరిస్థితి’లో పార్టీ వైపే మొగ్గు చూపాల్సిన పరిస్థితి తలెత్తిందని వారు వాపోతున్నారు.

Related Posts