యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీలో వైసీపీ మినహా ఇతర పార్టీలకు చెందిన అనేక మంది నేతలు తమ రాజకీయ భవిష్యత్త్తును వెతుక్కునే పనిలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ అఖండ మెజార్టీతో అధికారంలోకి రావడంతో... ఆ పార్టీ దాదాపుగా హౌస్‌ఫుల్ బోర్డు పెట్టేసింది. ఇతర పార్టీలకు చెందిన నాయకులను తమ పార్టీలో చేర్చుకునే విషయంలో వైసీపీ నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో అనేక మంది నేతలు జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ జాబితాలో టీడీపీతో పాటు జనసేన నేతలు కూడా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా... ఏపీలో ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి జనసేనలో చేరిన ఆ పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ... జనసేన తరపున ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో విభేదాల కారణంగా ఆయన బీజేపీని వీడారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఎన్నికల్లో జనసేన ఘోరంగా ఓడిపోవడంతో... ఇక ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఆకుల సత్యనారాయణ కూడా పార్టీ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణ... తిరిగి బీజేపీలో చేరేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ సైతం... వైసీపీ మినహా ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను చేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఆకుల సత్యనారాయణ మళ్లీ బీజేపీలోకి వెళ్లడానికి పెద్దగా అడ్డంకులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే ఇంత తొందరగా మళ్లీ ఆయన బీజేపీకి వెళతారా లేక మరికొంతకాలం వేచి చూస్తారా అన్నది తెలియాల్సి ఉంది.