యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్హులైన అర్చకులందరికీ అనగా సుమారు 6వేల మంది అర్చకులకు ఇళ్లు,ఇళ్లస్థలాలను సమకూర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు రాష్ట్ర
దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు.శుక్రవారం అమరావతి సచివాలయం 2వ బ్లాకులో కేటాయించిన చాంబరులో మొదటిసారి అడుగుపెట్టిన అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.ఈసందర్భంగా రాష్ట్రంలో దేవాదాయశాఖలో పనిచేస్తున్న అర్హులైన అర్చకులందరికీ ఇంటి స్థలాలు,ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రతిపాదించిన దస్త్రం )పై తొలిసంతకం చేశారు.అదేవిధంగా ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న దేవాదాయ ధర్మాదాయ సంస్థల సిబ్బంది బదిలీలకు సంబంధించిన నిబంధనావళికి సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు తగిన ఆదేశాల జారీచేసిన దస్త్రంపై రెండవ సంతకం చేశారు.అలాగే రాష్ట్రంలో 6-సి దేవాలయాల్లో పనిచేస్తూ దేవాదాయశాఖ ద్వారా పారితోషికం పొందుతున్న అర్చకులకు ప్రస్తుతం ఇస్తున్న పారితోషికంనకు అదనంగా మరో 25శాతం పెంచేందుకు ప్రతిపాదించిన దస్త్రంపై మూడవ సంతకం చేశారు.ఈసందర్బంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మానిపెస్టోలో పేర్కొన్న విధంగా పైమూడు అంశాలపై తక్షణ చర్యలు తీసుకునేందుకు వీలుగా 13 జిల్లాల నుండి సకాలంలో సమాచారం సేకరించి నివేదిక సిద్ధం చేయాల్సిందిగా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.అదే విధంగా అన్యాక్రాంతమైన దేవాదాయశాఖ భూములను స్వాధీనం చేసుకుని ఆభూముల పరిరక్షణకు అవసమరైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
దేవాదాయశాఖలో పనిచేస్తూ చాలాకాలంగా జోనల్ స్థాయిలో బదిలీల ప్రక్రియ పెండింగ్ లో ఉందని త్వరలో బదిలీల ప్రక్రియను చేపట్టేందుకు వీలుగా అవసమరైన నియమ నిబంధనలను రూపొందించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.రాష్ట్రంలోని 6-సి దేవాలయాల్లో పనిచేస్తూ దేవాదాయశాఖ ద్వారా పారితోషికం పొందుతున్న అర్చకుల పారితోషికాన్ని 25శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని దీనివల్ల సుమారు 1300 మంది అర్చకులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.ఇందుకుగాను 8కోట్ల 60లక్షల రూ.లు వ్యయం అవుతుందని అందుకు తగిన బడ్జెట్ ప్రతిపాదనలు ఆర్ధికశాఖకు పంపాల్సిందిగా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
రాష్ట్రంలోని 11 ప్రధాన దేవాలయాలు,72ఇతర ముఖ్యమైన దేవాలయాలకు సంబంధించి బృహత్ ప్రణాళికలు రూపకల్పనకు త్వరలో చర్యలు చేపట్టడం జరుగుతుందని మంత్రి శ్రీనివాసరావు వెల్లడించారు.దేవాలయాలకు ప్రతినిత్యం వేలాదిగా వచ్చే భక్తులకు మరిన్ని మేలైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంలో భాగంగా ఈ బృహత్ ప్రణాళికల రూపకల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి పేర్కొన్నారు.దేవాదాయశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరలో అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.అదేవిధంగా ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి కూడా త్వరలో అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
ఈకార్యక్రమంలో దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్, దేవాదాయశాఖ కమీషనర్ పద్మ,ఇంకా విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం, సింహాచలం,అన్నవరం,శ్రీశైలం తదితర దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ అధికారులు,దేవాదాయశాఖ అధికారులు,సిబ్బంది,వివిధ దేవాలయాలకు చెందిన అర్చకులు పాల్గొన్నారు.