టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తాజాగా పార్టీలో ఏర్పడిన సంక్షోభంపై స్పందించారు. నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీని వీడి బీజేపీలో చేరడం పట్ల ఆయన మాట్లాడుతూ, సాంకేతికపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే టీడీపీ విలీనం చెల్లదని అన్నారు. విలీనం చెందాలంటే ఓ పార్లమెంటరీ పార్టీలో రెండింట మూడు వంతుల మెజారిటీ అవసరమని అన్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులను కలుపుకుని తొమ్మిది మంది ఉన్నప్పుడు, వాళ్లలో నలుగురు వెళ్లిపోతే 2/3 మెజారిటీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఒకవేళ కేవలం రాజ్యసభను లెక్కలోకి తీసుకుంటే ఆరుగురు సభ్యుల్లో నలుగురు వెళ్లిపోతే 2/3 మెజారిటీ అవుతుంది కదా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, 1992లో సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఓ తీర్పు వెలువడిందని, ఉభయసభల సభ్యులను మొత్తంగా పరిణనలోకి తీసుకున్న ఆ సందర్భాన్ని కూడా తాము ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగా చర్చించి, న్యాయసలహా తీసుకుని ముందుకు వెళతామని చెప్పారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత టీడీపీ పార్లమెంటరీ పార్టీ తరఫు నుంచి కూడా రాజ్యసభ చైర్మన్ కు ఓ లేఖ అందజేస్తామని వెల్లడించారు. ఇక, అకస్మాత్తుగా నలుగురు ఎంపీలు పార్టీని వీడడం వెనుక కొంత కుట్ర కూడా ఉండొచ్చని యువనేత అభిప్రాయపడ్డారు. టీడీపీని దెబ్బతీసేందుకే ఫిరాయింపులను ప్రోత్సహించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.