యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
శబరిమల వివాదంపై కేరళలో పాలక వామపక్ష ప్రభుత్వం స్వరం మారింది. లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి ఓట్ల శాతం పెరగడంతో సీపీఎం నేతృత్వంలోని ప్రభుత్వం శబరిమల ఆలయ వివాదంపై మెతక వైఖరి తీసుకున్నట్టు వెల్లడవుతోంది. శబరిమల ఆలయ సంప్రదాయాలను పరిరక్షించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ కోరారు. పది నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు, బాలికలకు శబరిమల ఆలయంలోకి అనుమతించరాదన్నది ఆలయ సంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే.అయితే శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలనూ అనుమతించాలన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కేరళ వామపక్ష ప్రభుత్వం వ్యవహరించింది. మరోవైపు సుప్రీం ఉత్తర్వులు ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని బీజేపీ, ఆరెస్సెస్ సహా హిందూ సంస్ధలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగాయి. ఈ ఆందోళనల ఊతంతో బీజేపీ వామపక్ష ప్రాబల్య కేరళలో ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో గణనీయంగా ఓట్లను కొల్లగొట్టడం మారిన ప్రభుత్వ వైఖరికి అద్దంపడుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, కేంద్రం శబరిమల ఆలయ సంప్రదాయాలను కాపాడుతూ చట్టం చేసేందుకు కొంత సమయం పడితే ఈ లోగా ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని కేరళ దేవాదాయ మంత్రి కోరారు.