యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పసిడి ధర అడ్డుఅదుపు లేకుండా పెరిగిపోతోంది. దేశీ మార్కెట్‌లో మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా బంగారం ధర భారీగా పెరిగింది. గ్లోబల్ కేంద్ర బ్యాంకులు పసిడి కొనుగోలు వైపు మొగ్గుచూపడంతో ధరలు పెరుగుతున్నాయి. అదేసమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల కోత ఉండొచ్చని సంకేతాలు ఇవ్వడంతో బంగారం ధర రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1,400 డాలర్ల మార్క్ పైకి చేరింది. ఇది ఆరేళ్ల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. అమెరికా డాలర్ బలహీనపడటం, ఆర్థిక ఆందోళనలు, వాణిజ్య ఉద్రిక్తతలు వంటి అంశాలు కూడా పసిడి పరుగుకు బలాన్ని చేకూర్చాయి. మరోవైపు ఇరాన్.. అమెరికా స్పై డ్రోన్‌ను కూల్చడంతో అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగే అవకాశముంది. బంగారం ధర జూన్ నెలలో ఇప్పటి వరకు దాదాపు 10 శాతం మేర పెరిగింది. ఔన్స్ బంగారం ధర 1,411 స్థాయికి కూడా చేరింది. 2013 సెప్టెంబర్ నుంచి చూస్తే ఇదే గరిష్ట స్థాయి. ఇకపోతే బంగారం ధర 2011లో యూరోజోన్ సంక్షోభం కారణంగా 1,900 డాలర్లకు కూడా ఎగసింది.