లోక్‌సభలో ఇవాళ ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టారు. దాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే.. శశిథరూర్ దానిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణ తలాక్ పద్ధతికి తాను వ్యతిరేకమే అని, కానీ దాన్ని క్రిమినల్ చర్యగా చూడడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు శశిథరూర్ చెప్పారు. బిల్లులో ఉన్న మూలాలను అన్ని వర్గాల మహిళలకు విస్తరించేలా చూడాలని కాంగ్రెస్ ఎంపీ సూచించారు. బిల్లు గతంలో లోక్‌సభలో పాసైందని, కానీ రాజ్యసభలో గట్టెక్కకపోవడం వల్ల దాన్ని మళ్లీ ప్రవేశపెట్టాల్సి వచ్చిందని మంత్రి రవిశంకర్ తెలిపారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కూడా బిల్లును వ్యతిరేకించారు. ముస్లిమేతర వ్యక్తులకు ఏడాది కాలానికి శిక్షి వేస్తున్నారని, కానీ ముస్లిం మతానికి చెందిన మగవారికి మాత్రం మూడేళ్లు శిక్షను వేస్తున్నారని ఆరోపించారు. ముస్లిం మహిళల పట్ల చూపిస్తున్న ఆదరణ.. శబరిమల అంశంలో హిందువు మహిళల పట్ల ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 14, 15 ఆర్టికల్స్‌ను బిల్లు అతిక్రమిస్తున్నదని అసద్ అన్నారు.