యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి అధ్యక్షునిగా వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉదయం ఆయన చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రకాశం జిల్లా మేదరమెట్ల గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి స్వయానా తోడల్లుడు.
వైఎస్ మరణం తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో స్థాపించిన వైఎస్సార్సీపీలో వైవీ దశాబ్ద కాలంగా క్రియాశీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2014లో ఆయన ఒంగోలు ఎంపీగా గెలుపొందారు. రాష్ట్ర విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్‌సభలోనూ,వెలుపల పోరాడారు. హోదా కోసం సహచర ఎంపీలతోపాటు ఆయన తన పదవిని త్యాగం చేశారు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయక పోయినా పార్టీ గెలుపు కోసం గట్టి కృషి చేశారు.