YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జూన్ 30 నాటికి కాంగ్రెస్ కు కొత్త బాస్

జూన్ 30 నాటికి కాంగ్రెస్ కు కొత్త బాస్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:  

130 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమైంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ ఈ విషయాన్ని గురువారం ధ్రువీకరించారు. పార్టీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఆయన పరోక్షంగా వెల్లడించారు. పదిహేడవ లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి దారితీసిన పరిస్థితులను విశే్లషించేందుకు గత నెల మే 30న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని రాహుల్ గాంధీ సూచించారు. తన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంకా గాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టరని ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోవాలంటూ రాహుల్ గాంధీకి నచ్చజెప్పేందుకు కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులు తీవ్రంగా కృషి చేశారు. ఒక కార్యనిర్వాహక అధ్యక్షుడిని నియమించటం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చునని వారు రాహుల్ గాంధీకి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే రాహుల్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా అధ్యక్ష పదవికి తాను చేసిన రాజీనామాకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సూచించిన విధంగా నెల రోజుల్లోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఆయన మరోసారి స్పష్టం చేయటంతో పార్టీ సీనియర్ నాయకులు ఇప్పుడు కొత్త అధ్యక్షుడి వేటలో పడ్డారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్‌తోపాటు మరో ఇద్దరి పేర్లను అధ్యక్ష పదవికి పరిశీలిస్తున్నట్లు తెలిసింది. జూన్ 30 తేదీ నాటికి కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారనే మాట వినిపిస్తోంది

Related Posts