యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం రికార్డు వేగంతో పూర్తి చేసిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైన నేపథ్యంలో ట్విటర్లో విజయ సాయిరెడ్డి స్పందించారు. సొంత నిధులతో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసింది. 45 లక్షల ఎకరాలకు నీరందుతుంది. కేంద్రం నిధులిచ్చినా ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సగం కూడా నిర్మించలేక పోయారు. ఎంత సేపు నిధులను దోచుకోవడం తప్ప పూర్తి చేయాలన్నసంకల్పమే లేదని మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విదేశీ పర్యటనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు విహార యాత్రకు ఏ దేశం వెళ్లారో ఆ పార్టీ నాయకులకూ తెలియదు. స్విట్జర్లాండ్ వెళ్లారో స్వీడన్లో ఉన్నారో చెప్పలేనంత రహస్యమా? ఎల్లో మీడియా కూడా యూరప్ నుంచి ముఖ్య నాయకులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారని రాసింది. యూరప్ అనేది దేశం కాదు. 44 దేశాలున్న ఖండమని అందరికీ తెలుసు. అని ఎద్దేశా చేశారు. బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు చంద్రబాబు బినామీలే. తనపై అవినీతి కేసులు పెట్టకుండా రక్షణ కోసమే వారిని పంపించారు. తనకు తెలియకుండానే జరిగితే ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించాల్సిందిగా రాజ్యసభ చైర్మన్కు లేఖ అయినా రాసి ఉండేవారు. ఇది 100% మ్యాచ్ ఫిక్సింగే. నలుగురు టీడీపీ ఎంపీలు పార్టీ మారితే అనుకూల మీడియా చాలా జాగ్రత్తగా, బీజేపీకి ఆగ్రహం తెప్పించకుండా వార్తలు రాసింది. రెండేళ్ల నుంచి బీజేపీ, మోదీపైన దుమ్మెత్తి పోసిన మీడియా ఇప్పుడు బాబు తీసుకున్న లైన్ను అర్థం చేసుకుంది. ఇక నుంచి బీజేపీని ప్రశంసించే వార్తలొస్తాయి అని వ్యాఖ్యానించారు