యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గరుడ ఆళ్వార్ సన్నిధిలో వైవీ సుబ్బారెడ్డితో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రమాణం చేపించారు. 'సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. తిరుమలలో త్రాగునీటి సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరిస్తాం. అర్చకుల సమస్యపై పీఠాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. గతంలో లాగానే మఠాధీపతులు, పీఠాధిపతుల సదస్సు నిర్వహిస్తాం. శ్రీవారి ఆభరణాలపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తాం' అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ఎంపీ విజయసాయి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు, చీఫ్‌విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన, రవీంద్రనాథ్ రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ పాలకమండలి సభ్యుడు రౌతు సూర్యప్రకాశరావు, నిర్మాత దిల్ రాజులు హాజరయ్యారు.ప్రకాశం జిల్లా మేదరమెట్ల గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి స్వయానా తోడల్లుడు. వైఎస్ మరణం తరువాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో స్థాపించిన వైఎస్సార్‌సీపీలో వైవీ దశాబ్ద కాలంగా క్రియాశీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2014లో ఆయన ఒంగోలు ఎంపీగా గెలుపొందారు. రాష్ట్ర విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్‌సభలోనూ, వెలుపల పోరాడారు. హోదా కోసం సహచర ఎంపీలతోపాటు ఆయన తన పదవిని త్యాగం చేశారు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయక పోయినా పార్టీ గెలుపు కోసం గట్టి కృషి చేశారు. ప్రస్తుతం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు