YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పిల్లలపై పెరుగుతున్న అత్యాచార సంఘటనలు

పిల్లలపై పెరుగుతున్న అత్యాచార సంఘటనలు

దేశంలో ఇటీవల పిల్లలపై పెరుగుతున్న పలు అత్యాచార సంఘటనలపై స్పందించిన పలు ప్రాంతీయ, జాతీయ పత్రికలు 2015 నుంచి 2016 మధ్య ఏడాది కాలంలోనే పిల్లలపై అత్యాచార సంఘటనలు ఏకంగా 82 శాతం పెరిగాయంటూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. జాతీయ నేరాల రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 2015లో పిల్లలపై అత్యాచార కేసులు 10,854 నమోదు కాగా, 2016లో 19,765 కేసులు నమోదయ్యాయని, అంటే 82 శాతం కేసులు పెరిగాయని కూడా ఆ పత్రికలు పేర్కొన్నాయి. భారత్‌లో రోజురోజుకు పిల్లలపై అత్యాచారాలు పెరిగి పోతున్నాయంటూ అంతర్జాతీయ పత్రికలైన ‘ది న్యూయార్క్‌ టైమ్స్, ది గార్డియన్, ది వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రికలు కూడా ఈ లెక్కలనే గతంలో పేర్కొన్నాయి. వాస్తవానికి ఆ ఏడాది కాలంలో పిల్లలపై అత్యాచార ఘటనలు ఒక్క శాతానికన్నా ఎక్కువ పెరగలేదు. మరి ఎందుకు లెక్కలు తప్పాయి ? జాతీయ నేరాల రికార్డు బ్యూరో లెక్కల్లోనే తేడా ఉందా ? పత్రికల్లో పేర్కొన్న లెక్కల్లోనే తేడా వచ్చిందా? దేశంలో నకిలీ వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన వాస్తవాలను కూడా గ్రహించాల్సి అవసరం ఉంది. 2012 సంవత్సరం వరకు రేప్‌ కేసులను బాధితుల వయస్సుతో నిమిత్తం లేకుండా భారతీయ శిక్షాస్మతి (ఐపీసీ–1860) కింద నమోదు చేసేవారు. 2012లో ‘లైంగిక నేరాల నుంచి పిల్లలను పరిరక్షించే చట్టం (పోస్కో)ను తీసుకొచ్చారు. అప్పటి నుంచి పిల్లలపై జరుగుతున్న రేప్‌ కేసులను రెండు సెక్షన్ల కింద నమోదు చేస్తూ వస్తున్నారు. ‘క్రైమ్‌ ఇన్‌ ఇండియా 2016–స్టాటటిక్స్‌’ పేరిట జాతీయ నేరాల రికార్డు బ్యూరో 2017, డిసెంబర్‌ నెలలో ఓ నివేదికను  విడుదల చేసింది. అందులో ఐపీసీ, పోస్కో చట్టాల కింద నమోదైన రేప్‌ కేసులను రెండు కలిపి 19,765 కేసులుగా పేర్కొంది. 2015లో జరిగిన రేప్‌లకు సంబంధించి కేవలం ఐపీఎస్‌ కింద నమోదయిన 10,854 కేసులను పేర్కొంది. మరోచోట ఎక్కడో పోస్కో చట్టం కింద 8,800 కేసులు నమోదయినట్లు పేర్కొన్నది. ఈ రెండింటిని కలిపితే 19,654 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. 2016లో నమోదైనట్లు పేర్కొన్న రేప్‌ కేసుల సంఖ్య 19,765 నుంచి ఈ 19,654 కేసులను తీసినేస్తే తేలే సంఖ్య 111. అంటే ఒక్క శాతానికి మించి కూడా కేసులు పెరగలేదన్న మాట. ఒక ఏడాదికి ఐపీసీ కింద నమోదైన సంఖ్యను మాత్రమే తీసుకొని ఆ తర్వాత సంవత్సరానికి ఐపీసీతోపాటు పోస్కో చట్టం కింద నమోదైన కేసులను పరిగణలోకి తీసుకోవడం వల్ల పొరపాటు జరిగిందని తేలిపోతోంది. పిల్లలకు సంబంధించిన రేప్‌ కేసులను పరిగణలోకి తీసుకోవాలనుకున్నప్పుడు రెండు సెక్షన్ల కింద నమోదైనవి కాకుండా ‘పోస్కో’ చట్టం కింద నమోదయిన కేసులను మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

Related Posts