యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో: బతికిపోయాం! శనివారం మ్యాచ్ అయ్యేసరికి ప్రతి భారత అభిమానిదీ ఇదే అనుభూతి! మరి అఫ్గానిస్థాన్ మామూలుగా భయపెట్టిందా? భారత్ కేవలం 11 పరుగులతో గట్టెక్కిందీ మ్యాచ్‌లో. 225 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ తుది కంటా పోరాడి.. ఇంకో బంతి మిగిలుండగా 213 పరుగులకు ఆలౌటైంది. జస్‌ప్రీత్ బుమ్రా (2/39), మహ్మద్ షమి (4/40) సమయోచిత బౌలింగ్‌తో భారత్‌ను రక్షించారు. అసాధారణ రీతిలో పోరాడిన మహ్మద్ నబి (52; 55 4×4, 1×6) టీమ్‌ఇండియాను వణికించాడు. షమి చివరి ఓవర్లో అతడిని ఔట్ చేయడంతో పాటు హ్యాట్రిక్ పడగొట్టి భారత్‌ను గెలిపించాడు. మొదట భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 224 పరుగులే చేయగలిగింది. విరాట్ కోహ్లి (67; 63 బంతుల్లో 5×4), కేదార్ జాదవ్ (52; 68 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. మహ్మద్ నబి (2/33) బౌలింగ్‌లోనూ భారత్‌ను ఇబ్బంది పెట్టాడు. ముజీబ్ రెహ్మాన్ (1/26), రషీద్ ఖాన్ (1/38) కూడా చక్కటి ప్రదర్శన చేశారు. బుమ్రా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. టోర్నీలో నాలుగో విజయం సాధించిన భారత్.. గురువారం తన తర్వాతి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఢీకొంటుంది.