YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం - కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి-

 ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం - కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి-

పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఎల్లప్పుడు ముందుండాలని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం 1వ డివిజన్‌ లోని కమ్యూనిటీ హాలులో 1, 2, 50 డివిజన్లకు చెందిన నాయకులు, కార్యకర్తలు తో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ముందుగా ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అధికారంలో లేనంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. గెలుపోటములు సహజమని, అటుపోట్లను తట్టుకొని నిలబడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఇటువంటి ఆటుపోట్లను చాలానే చూశారని, ఈ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఆయన ధైర్యం కోల్పోలేదు అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. అధికార పార్టీ చేసే తప్పులను గ్రహించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.  రాజకీయాలలో గెలుపోటములు సహజమని, ఓటమికి కారణాలు అన్వేషించి విజయం దిశగా అడుగులు వేయాలని అన్నారు. ఓటమి పాలైనంత మాత్రాన మన అధినాయకుడు చంద్రబాబు కృంగిపోయే వ్యక్తి కాదని, రెట్టింపు ఉత్సాహంతో కేడర్‌ను ముందుకు నడిపిస్తారని అన్నారు. రానున్న కార్పొరేషన్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ విజయమే ధ్యేయంగా పని చేయాలని పిలుపునిచ్చారు. గుడా మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ మాట్లాడుతూ ఓటమితో కృంగిపోయే పార్టీ తెలుగుదేశం కాదని, పోరాట స్పూర్తితో పార్టీని బలపరుద్దామని పిలుపునిచ్చారు. అధికార పార్టీ చేసే తప్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుదామన్నారు. అధికార పార్టీ తప్పులనే అస్త్రాలుగా చేసుకుని ప్రజలకు వివరించాలన్నారు. అలాగే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో నిజంగా ఎవరు లభ్ధిపొందుతున్నారో గుర్తించి నిజమైన అర్హులకు అవి చేరని పక్షంలో ధైర్యంగా నిలదీయాలని పిలుపునిచ్చారు. మనం అధికారంలో లేనంత మాత్రాన ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదని, మంచి రోజులు ముందున్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి యర్రా వేణు గోపాలరాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జీవనది అని... ప్రజల మనస్సుల్లోంచి తెలుగుదేశం పార్టీని ఎవరూ తీసివేయలేరన్నారు. అధికారంలో ఉన్నా... లేకున్నా తెలుగుదేశం పార్టీ ప్రజల వెంటే ఉంటుందన్నారు. 2007లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయం సాధించామని గుర్తు చేశారు. ఈ సారి జరగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూడా పార్టీ కేడరంతా కష్టపడి పని చేసి నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగురవేసే విధంగా కృషి చేయాలన్నారు.  తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) మాట్లాడుతూ రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికలలో తప్పనిసరిగా తెదేపా జెండాను రెపరెపలాడిస్తామన్నారు. ప్రజలతోనే ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని, అందరి కష్టాలను తెలుసుకుని సంక్షేమ పధకాలు అమలు చేశారని అన్నారు. మన ముందు ఉన్న విజయ లక్ష్యం నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయం సాధించడమని సూచించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనంత మాత్రాన ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. కార్యకర్తలకు ఎటువంటి సమస్య, కష్టం ఎదురైనా అండగా తామంతా ఉంటామని భరోసా ఇచ్చారు. నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కాశి నవీన్‌, ఏరియా కో ఆర్డినేటర్‌ ఉప్పులూరి జానకి రామయ్య, కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, పితాని లక్ష్మీకుమారి, 50వ డివిజన్‌ ఇన్‌ఛార్జ్‌ రవియాదవ్‌, మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు, రుద్ర, కురగంటి సతీష్‌, నాయకులు పితాని కుటుంబరావు, హరి బెనర్జీ, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts