యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రెండు తెలుగు రాష్ట్రాలపైనా కన్నేసిన కేంద్రంలోని కమలనాథులు… వచ్చే ఐదేళ్లలో పుంజుకునే దిశగా వేస్తున్న అడుగులు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అటు తెలంగాణ, ఇటు ఏపీలపై కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ దృష్టి పెట్టింది. నిజానికి ఇప్పటికే ఉత్తరాది సహా ఈశాన్య రాష్ట్రాలు, హిందీ బెల్ట్‌లో పుంజుకుని, అక్కడ కాంగ్రెస్‌కు దిక్కులేకుండా చేసిన బీజేపీ.. గడిచిన పార్లమెంటు ఎన్నికల సమయంలోనే దక్షిణాదిపై కన్నేసింది. అయితే, అప్పట్లో అది సాధ్యం కాలేదు. కానీ, ఇప్పుడు వచ్చే ఐదేళ్లకు ముందుగానే ఈ రెండు తెలుగు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకుంది.అయితే, ఒక్క ఏపీ, తెలంగాణల్లోనే బీజేపీ పాగావేయాలని భావించిందా? అంటే.. కానేకాదు. అటు తమిళనాడు, కేరళలపై నా దృష్టి పెట్టింది. అయితే, ఆ రెండు రాష్ట్రాల్లోనూ కమల నాధుల కలలు ఫలించలేదు. అంతేకాదు, ఆయా రాష్ట్రాల్లోని ప్రజలు, నాయకులు కూడా సెంటిమెంట్‌కు పడిపోతారనే విషయం ఇటీవలి అనేక పరిణామాలు బీజేపీకి తెలిసివచ్చాయి. ఇక, కర్ణాటకలో ఇప్పటికే బీజేపీ పాతుకు పోయింది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలోని 28 ఎంపీ స్థానాలకు గాను 24 చోట్ల భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మొగించింది. దీంతో ఎట్టి పరిస్థితిలోనూ దక్షిణాదిలో బలపడి తీరుతామని కమల నాథులు భావించారు.ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణలపై ఆపరేషన్ లోటస్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి ఏపీలో ఎంపీలకు వల విసిరింది. నయానో భయానో తనవైపు తిప్పుకోవాలని భావించిన బీజేపీ ఎన్నికలకు చాలా కాలం క్రితమే టీడీపీ రాజ్యసభ సభ్యులను తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించింది. అయితే, ఇది సాధ్యం కాకపోవడంతో దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించింది. మొత్తానికి ఫలితం సాధించింది. ఇక, తెలంగాణలో బలంగా ఉన్న టీ ఆర్ ఎస్ జోలికి పోకుండా.. ఆ పార్టని ఓడించడమే ధ్యేయంగా పార్లమెంటు ఎన్నికలకు ముందుగానే డీకే అరుణ వంటివారిని చేర్చుకోవడం ద్వారా పావులు కదిపింది.ఇక బీజేపీయే ఊహించని విధంగా ఆ పార్టీ నుంచి తెలంగాణలో నలుగురు ఎంపీలు గెలిచారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో వీలుంటే అధికారంలోకి రావడం లేని పక్షంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రలో టీఆర్ఎస్‌కు ముచ్చెమటలు పట్టించాలన్నదే ఆ పార్టీ ప్లాన్‌గా తెలుస్తోంది. తెలంగాణలో తమకు ఓటర్లు ఉన్నా సంస్థాగతంగా పటిష్టంగా లేమన్న విషయాన్ని గ్రహించిన బీజేపీ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇక ఏపీలో టీడీపీని ఆక్రమించి ఆ ప్లేస్లోకి వచ్చేయాలన్న ప్లాన్‌తోనే పావులు కదుపుతోంది. సో.. మొత్తానికి ఇప్పుడు సౌత్‌లో ఆపరేషన్ లోటస్ చాలా వేగంగా సాగుతోందనేది వాస్తవం.