యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
టీడీపీకి జాతీయ హోదా లేదు. ఎన్నికల సంఘం వద్ద ఆ పార్టీ గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీగానే ఉంది. అయితే ఉమ్మడి ఏపీ రెండు ముక్కలు కావడంతో బాబు హఠాత్తుగా జాతీయ అధ్యక్షుడు అయిపోయారు. ఏపీ, తెలంగాణా రెండు శాఖలు కూడా పెట్టారు. న్యాయంగా జాతీయ పార్టీ అంటే అయిదారు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో కనీసంగా ఆరు శాతం ఓట్ల వాటా తెచ్చుకోవాలి. ఆ విధంగా చూస్తే టీడీపీ ఎప్పటికీ జాతీయ పార్టీ కాలేదు. కానీ తమ్ముళ్ళు ఆనందపడడానికి, చెప్పుకోవడానికి బాబు గారు జాతీయ అధ్యక్షుడు అంటే బాగుంటుంది కదా. సరే ఈ ముచ్చట్లో మరో చిత్రం ఏంటి అంటే ఏపీ టీడీపీకి కళా వెంకటరావు అధ్యక్షుడు. తన సొంత అసెంబ్లీ సీటు దాటి బయటకు రాని కళా వారు తాజా ఎన్నికల్లో అక్కడ కూడా ఓటమిపాలు అయ్యారు.ఇక ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడుగా దివంగత ఎర్రన్నాయుడు కుమారుడు కింజరపు రామ్మోహన్నాయుడు ని నియమించాలని చంద్రబాబు అనుకుంటున్నారట. మంచి వాగ్దాటి ఉంది. బీసీ వర్గానికి చెందిన యువకుడు. విద్యావంతుడు. పైగా రెండవసారి ఎంపీగా ఎన్నిక అయ్యాడు. మరో వైపు జగన్ నాయకత్వంలో యువ పార్టీ ఏపీలో అధికారంలో ఉంది. యువకుడితోనే ఢీ కొట్టిస్తే బాగుంటుందని చంద్రబాబు ప్లాన్. ఇక బీసీల జిల్లాలైన ఉత్తరాంధ్రలో గాలి ఈసారి వైసీపీ వైపుగా మళ్ళింది. దాన్ని తిరిగి వెనక్కు తెచ్చేందుకు రామ్మోహన్నాయుడు ఉపయోగపడతారని బాబు గారి ఎత్తుగడ. కొంతైనా జనాల్లో వూపు వస్తుందని, యువతను కూడా ఆకట్టుకుంటారని ఆశ.ఇవన్నీ సరే కానీ అసలు బాబు గారు పార్టీని నడిపేందుకు కుర్చీ ఖాళీ చేసి ఇస్తే కదా. ఏపీ టీడీపీకి ఓ ఆఫీస్ కాదు కదా ప్రత్యేకంగా గది కూడా ఉండదేమో.
ఉన్నా కూడా చంద్రబాబుని కాదని ఎక్కడికి వెళ్తారు టీడీపీ నాయకులు. ఇక దేశంలో ఏ ఢిల్లీలోనో జాతీయ పార్టీలకు ఆఫీసులు ఉండి అక్కడ నేషనల్ ప్రెసిడెంట్ ఉంటే ఏపీలో అధ్యక్షుడికి పని ఉంటుంది. మరి ఇక్కడ బాబు గానే పూర్తి ఖాళీ. ఆయన పార్టీకి ఏపీలో తప్ప ఎక్కడా ఉనికి లేదాయే. అందువల్ల ఆయనే పార్టీలో సుప్రీం. అంటే పేరుకు నీకో పదవి అంటూ రామ్మోహన్ని ముందు పెట్టడం అన్నమాట. అలాగే బీసీలకు ప్రెసిడెంట్ పదవి ఇచ్చామని ఓట్లను దండుకోవడానికి చెప్పుకోవచ్చు. ఓ విధంగా చూస్తే ఈ పదవి ఉత్సవ విగ్రహం. కళాకు అది అనుభవమైంది. ఇపుడు కుర్ర్రోడు రామ్మోహన్ వంతు మరి. అంతే.