యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గ కేంద్రమైన టెక్కలి మండలంలో పలు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులు బదిలీపై వెళ్లిపోవాలా... ఇక్కడే ఉండి విధులు నిర్వహించాలా... అనే మీమాంసలో ఉన్నారు. గత పాలక ప్రభుత్వంలో టెక్కలి ఎమ్మెల్యేగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు టెక్కలిలో పలు కీలక శాఖల అధికారులుగా పలువురు విధులు నిర్వహించారు. ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, నీటిపారుదల శాఖ, వంశధార, గ్రామీణ నీటి సరఫరా విభాగం, రోడ్లు, భవనాల శాఖ వంటి కీలకమైన విధుల్లో ఉన్న అధికారులు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత టెక్కలిలో విధులు నిర్వహించాలా? ఉండాలా? అనే సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలో ఉన్న తరుణంలో టెక్కలి ఎమ్మెల్యేగా గెలుపొందిన కింజరాపు అచ్చెన్నాయుడు టిడిపికి చెందినవారు కావడంతో అధికారులు ఇరకాటంలో పడే పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ఎవరిని ఆహ్వానించాలో తెలియని సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో టిడిపికి చెందిన ఎంపిపి మట్ట సుందరమ్మ చేతుల మీదుగా విత్తనాలు పంపిణీ చేయగా... సాయంత్రం వైసిపి
టెక్కలి నియోజకవర్గ కన్వీనర్ పేరాడ తిలక్ చేతుల మీదుగా విత్తనాలు పంపిణీ చేశారు. అలాగే రాజన్న బడిబాట కార్యక్రమం ప్రారంభంలో విద్యాశాఖ అధికారులు ఎవరిని ఆహ్వానించకుండా ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో పేరాడ తిలక్ కొన్ని రోజుల క్రితం ఎస్‌పి, కలెక్టరును కలిసి టెక్కలి నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి పనులపై ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని, వీటిపై దర్యాప్తు నిర్వహించాలని కోరారు. అలాగే టిడిపి ప్రభుత్వ హయాంలో నమోదైన పోలీస్ కేసులను పరిశీలించాలని కోరడంపై టెక్కలి మండల స్థాయి అధికారుల్లో గుబులు రేగుతుంది. సంక్షేమ పథకాలు అందివ్వడంలోనూ, నిధులు మంజూరు, విడుదల్లోనూ, వివిధ రకాల అభివృద్ధి పనుల నిర్మాణంలోనూ అధికారులు నిబంధనలు పాటించారా? లేదా? ఆనే సందేహాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా టెక్కలి మండల స్థాయి అధికారుల్లో మాత్రం గుబులు వదలడం లేదు.