YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సెల్ఫ్ గోల్ చేసుకున్న మమతా బెనర్జీ

సెల్ఫ్ గోల్ చేసుకున్న మమతా బెనర్జీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చిక్కులను కొని తెచ్చుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన డబ్బును తిరిగి ఇచ్చేయాలని సొంతపార్టీ నేతలకు ఆమె ఆదేశాలివ్వడం అధికార పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. సీఎం ఆదేశాల తర్వాత.. భూమి లేని రైతుల నుంచి వ్యాపారవేత్తల వరకు వందలాది మంది ప్రజలు తమ వద్ద నుంచి డబ్బు తీసుకున్న అధికార పార్టీ నేతల పేర్లను బహిరంగంగానే చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2020లో జరిగే పురపాలక ఎన్నికలు, 2021లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ పార్టీకి కష్టాలు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 18న కోల్‌కతా పురపాలక సంస్థ నేతలతో సమావేశమైన దీదీ.. సామాన్య ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బును తిరిగి ఇచ్చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. కొంతమంది టీఎంసీ నేతలు చనిపోయిన వారిని కూడా వదలడం లేదని, అంత్యక్రియల నిమిత్తం బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అందించే రూ.2000 విడుదల చేసేందుకు రూ.200 కమీషన్‌గా తీసుకుంటున్నారని ఆరోపించారు. నిర్మల్ బంగ్లా ప్రాజెక్ట్‌లో మాజీ గ్రామ పంచాయతీ ప్రధాన్ సుకేశ్ ప్రధాన్ రూ.కోటి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రజలు ఆందోళనకు దిగడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అధికార పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ప్రతిరోజు ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో పంచాయతీ సభ్యుల నుంచి, రాజ్యసభ ఎంపీ వరకు ఉన్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాజ్‌పూర్-సోనార్‌పూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శాంత సర్కార్‌ను టీఎంసీ తొలిగించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, నిర్మల్ బంగ్లా ప్రాజెక్ట్ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ బీర్బమ్ జిల్లా సైంతియా గ్రామ పంచాయతీ సభ్యుడి నివాసం ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఉపాధి కూలీ సొమ్మును నొక్కేసిన పౌరీ గ్రామ పంచాయితీ ప్రధాన్‌ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామ ప్రజలు నిరసన చేపట్టారు. అయితే ఈ ఆందోళనల వెనుక బీజేపీ హస్తముందని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. 2012-18 మధ్య.. నాటి టీఎంసీ కౌన్సిలర్, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శంతను సేన్‌కు తాను రూ.40 లక్షలు ముట్టజెప్పినట్లు కోల్‌కతాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సుమంత చౌధరి శుక్రవారం ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను శంతను సేన్ ఖండించారు. వ్యాపారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. టీఎంసీ నేతలు దోపిడీ చేస్తున్నారని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలు నిజమేనని తాజా ఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్రతిపక్షాల పనిని ముఖ్యమంత్రి మరింత సులువు చేశారు అని రాజకీయ విశ్లేషకులు సువశిస్ మైత్ర అభిప్రాయపడ్డారు. అవినీతిని వ్యవస్థీకృతం చేసి, ఇప్పుడేమో తానొక్కదాన్నే నిజాయితీగల నాయకురాలిగా తనకుతానుగా చిత్రీకరించుకునేందుకు మమత యత్నిస్తున్నారు. దోపిడీకి వ్యతిరేకంగా సొంత పార్టీ ఎంపీ కబీర్ సుమన్ మాట్లాడినప్పుడు ఆమె ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దోపిడీలో టీఎంసీలోని ప్రతి ఒక్కరికీ భాగముందని అందరికీ తెలుసు అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎండీ సలీం విమర్శించారు. కాలేజీ అడ్మిషన్ దగ్గర నుంచి మరుగుదొడ్డి నిర్మాణం వరకు ప్రతిదానికీ ప్రజలు టీఎంసీ నేతలకు కమీషన్లు ఇవ్వాల్సి వస్తున్నది అని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. కాగా, దీదీ అనుచరుడైన ప్రముఖ బెంగాలీ గాయకుడు నచికేత చక్రవర్తి.. కమీషన్లపై తాను రూపొందించిన కొత్త పాటను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే ఇందులో దీదీ అని ఉండడం గమనార్హం. అయితే దేశవ్యాప్తంగా ఉన్న అవినీతికి సంబంధించినది ఈ పాట అని, తానెప్పటకీ దీదీ అనుచరుడినేని చక్రవర్తి పేర్కొన్నాడు

Related Posts