యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీలో టీడీపీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీకి గూటికి చేరి వారం కూడా గడవకముందే మరో నేత కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ సీనియర్ నేత అంబికా కృష్ణ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. త్వరలో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సోమవారం అంబికా కృష్ణ ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. బీజేపీతో చర్చించిన తర్వాత ఆయన పార్టీలో చేరిక ఎప్పుడు ఉంటుందో క్లారిటీ రానుంది. టీడీపీ నుంచి ఒక్కో నేత జారిపోవడంతో పార్టీలో కలవరం మొదలయ్యింది. త్వరలోనే మరికొందరు నేతలు తమ పార్టీలో చేరబోతున్నారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలతో టీడీపీ నేతల్ని టెన్షన్ పెట్టిస్తోంది. అంతేకాదు త్వరలోనే కొందరు ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు విదేశాల్లో ఉన్న సమయంలోనే నేతలు ఇలా పార్టీని వీడటం కలవరపెడుతోంది. చంద్రబాబు మంగళవారం విదేశాల నుంచి తిరిగిరానున్నారు.