Highlights
- చర్చించే బృందంలో యనమల
- సుజనా, కుటుంబరావు, రమేష్ తో పాటు
విభజన చట్టం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ కు రావాల్సిన హక్కులను సాధించుకునేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సోమవారం సాయంత్రం 5 గంటలకు టీడీపీ బృందం చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ బృందాన్ని మరింత పటిష్టం చేశారు. తాజాగా రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడును చేర్చారు. తొలుత సుజనారావు, కుటుంబరావు, సీఎం రమేష్ లను పంపుతున్నట్టు వెల్లడించిన చంద్రబాబు, తాజాగా యనమలనూ వెళ్లాలని ఆదేశించారు. ఇటీవల ఏపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగిన వేళ, బీజేపీపై చంద్రబాబు చేసిన కీలక వ్యాఖ్యల తరువాత, అమిత్ షా ఫోన్ చేసి చర్చలకు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీంతో బడ్జెట్ సమావేశాల తొలిరోజు సభ ముగియగానే ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రజల్లోని ఆగ్రహం, నెరవేరాల్సిన విభజన హామీలు తదితరాలపై అమిత్ షాకు మరింత వివరంగా చెప్పాలంటే, యనమల ఉంటే చర్చలు అర్ధవంతంగా జరుగుతాయన్న భానుతో సీఎం ఉన్నట్టుగా టీడీపీ వర్గాలు వెల్లడించాయి.