యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
చంద్రగ్రహణం కారణంగా జూలై 16న శ్రీవారి దర్శనానికి 16 గంటలపాటు విరామం ఏర్పడింది. దాదాపు 10 గంటలపాటు ఆలయంలో అన్ని కార్యక్రమాలు నిలిచిపోనున్నాయి. వాస్తవానికి చంద్రగ్రహణం.. 16వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 1.31 గంటల నుంచి 17వ తేదీ తెల్లవారు జామున 4.29 గంటల వరకు కొనసాగుతుంది. అయితే, గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి 6 గంటల ముందుగానే శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం సంప్రదాయం. ఆ ప్రకారం 16న రాత్రి 7 గంటలకు ఆలయం మూసివేస్తారు.వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దుచేశారు. 17వ తేదీ ఉదయం 5 గంటలకు ఆలయం తెరిచి సుప్రభాతం, శుద్ధి, పుణ్యాహవచనం చేస్తారు. ఇలా అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఉదయం 11 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమవుతుంది. దీంతో శ్రీవారి దర్శనం 16 గంటలపాటు నిలిచిపోనుంది. కాగా, 17వ తేదీ జరిగే ఆణివార ఆస్థానం పురస్కరించుకుని 16వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జూలై 16, 17 తేదీల్లో చోటుచేసుకున్న మార్పులను భక్తులు గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.