YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రజా వేదికకు అటు... ఇటు ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన

ప్రజా వేదికకు అటు... ఇటు ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన

ఏపీలో మాజీ సీఎం చంద్రబాబు ఉండవల్లి కరకట్టపై నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అక్రమ కట్టడమన్న పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలన్న నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుండగా... మరికొందరు మాత్రం ప్రజాధనం ఆదా చేస్తున్నామంటున్న జగన్... కోట్లాది రూపాయల ప్రజల డబ్బుతో నిర్మించిన కట్టడాన్ని కూల్చివేయడం సరికాదంటున్నారు.2016లో ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలి వచ్చారు. అప్పటికప్పుడు సీఎం కుటుంబం కోసం ప్రత్యేకంగా నివాసం నిర్మించేంత సమయం లేకపోవడంతో చంద్రబాబు సూచన మేరకు అదికారులు.. ఉండవల్లి కరకట్టపైన పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ నుంచి లీజుకు తీసుకున్న ఇంటి పక్కనే ఓ భవనం నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి తొలుత 5 కోట్లు కేటాయంచి
తర్వాత దాన్ని రూ.8.9కోట్లకు పెంచారు.ఆఘమేఘాల మీద కరకట్టపైన చంద్రబాబు నివాసానికి పక్కనే ప్రజావేదిక తయారైంది.కృష్ణానది పరివాహక ప్రాంతంలో కరకట్టపైన చంద్రబాబు నివాసముండటం, దాని పక్కనే కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి ప్రజావేదిక పేరుతో గ్రీవెన్స్‌ హాల్ నిర్మించడంపై అప్పట్లో విపక్షాలు భగ్గుమన్నాయి. అయినా చంద్రబాబు ఇవేవీ పట్టించుకోకుండా ఐదేళ్లు కాలం గడిపేశారు. చివరికి అధికారం టీడీపీ నుంచి వైసీపీ చేతికి మారడంతో మొదటిగా ప్రభుత్వం కన్ను ప్రజావేదికపైనే పడింది. అదే సమయంలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తన నివాసానికి ఆనుకుని ఉన్న ప్రజావేదికను అధికార కార్యకలాపాలకు వాడుకునేందుకు అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ కు లేఖ రాశారు. దీనిపై నిర్ణయం తీసుకోకుండా వారం రోజుల పాటు మౌనంగా ఉన్న జగన్.. ప్రజావేదికలోనే కలెక్టర్ల సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.చివరికి కలెక్టర్ల సమావేశం సందర్భంగా ప్రజావేదికలోనే ఈ సమావేశం నిర్వహించడానికి గల
కారణాలను సీఎం జగన్ బయటపెట్టారు. అక్రమ కట్టడం విషయాన్ని అధికారులందరి దృష్టికి తెచ్చేందుకే కలెక్టర్ల సమావేశం ఇక్కడ నిర్వహిస్తున్నట్లు జగన్ తెలిపారు. ఈ సమావేశం ముగియగానే ప్రజావేదికను కూల్చేస్తామని కూడా ప్రకటించారు. దీంతో అసలు ప్రజావేదిక కూల్చివేయాల్సిన అవసరం ఉందా లేదా అన్న చర్చ మొదలైంది.కరకట్టపై నిర్మాణం అక్రమమని తెలిసీ చంద్రబాబు దాదాపు 9 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ప్రజావేదిక నిర్మించడం సరికాదనే వాదన ఉన్నప్పటికీ... దాన్ని కూల్చివేయాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయం కూడా సరికాదనే వాదన అంతే బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ప్రజావేదిక నిర్మాణం కోసం వెచ్చించిన 9 కోట్ల రూపాయలు చంద్రబాబు జేబు నుంచి ఇచ్చింది కాదు, ఇది పూర్తిగా ప్రజాధనం మాత్రమే. అటువంటప్పుడు దీన్ని కూల్చివేయడం ద్వారా జగన్ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారనే వాదన మొదలైంది.సీఎం జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత గత ప్రభుత్వంతో పోలిస్తే అన్ని కార్యక్రమాల్లోనూ
ప్రజాధనం ఆదా చేస్తున్నారన్న మంచి పేరు తెచ్చుకున్నారు. స్వయంగా తన ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని కూడా కేవలం 30లక్షల రూపాయలతో పూర్తి చేసి రికార్డు సృష్టించారు. అంతెందుకు ఇవాళ కలెక్టర్ల సమావేశంలోనూ పది రూపాయల వాటర్ బాటిల్ వాడటం ద్వారా అధికారులకు ఆదర్శంగా నిలిచారు. అయితే ప్రజావేదిక విషయంలో మాత్రం దాదాపు రూ.9 కోట్ల రూపాయల ప్రజాధనం వృథాకు జగన్ ఎందుకు సిద్ధమవుతున్నారన్న అంశంపై మాత్రం విస్తృత చర్చ సాగుతోంది. అక్రమ కట్టడమనే కారణంతోనే జగన్ దీన్ని కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారా అంటే పక్కనే ఉన్న ఇతర ఆక్రమణలకూ దీన్ని వర్తింపజేయాల్సి ఉంటుంది. అలా కాదని ప్రజావేదికను మాత్రమే కూలిస్తే ఇది కేవలం పంతం కోసమే చేసిన విమర్శలు ఎదుర్కోక తప్పదు

Related Posts