యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పీఠం నుంచి నిష్క్ర మించారు. అయితే, ఈ క్రమంలోనే కొత్తగా ఏర్పడిన జగన్ ప్రభుత్వానికి, పదవి నుంచి దిగిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు కు మధ్య `సంప్రదాయాల`కు సంబంధించిన రగడ ప్రారంభమైంది. ఇది తొలి అసెంబ్లీ సమావేశాలను కుదిపేసింది. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక సందర్భంగా జరిగిన రగడ రోజుల తరబడి సాగింది. నూతన స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను స్పీకర్ సీటులో కూర్చోబెట్టేందుకు సభానేత, సీఎం జగన్ ముందుకు వచ్చారు.అయితే, స్పీకర్‌ను తోడ్కొని వెళ్లే కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు రాకుండా డిప్యూటీ నేత అచ్చన్నను పంపారు. ఇది తీవ్ర వివాదానికి కారణమైంది. ముందు మమ్మల్ని పిలవలేదని, పిలిస్తే వచ్చి ఉండేవారమని చంద్రబాబు వాదించారు. బాబుకు బొట్టు పెట్టలేదు.. అని అంటున్నారని, ఇదేమన్నా.. మా ఇంట్లో జరుగుతున్న ప్రైవేటు ఫంక్షనా అని జగన్ దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే చెవిరెడ్డి.. అచ్చన్నను బంట్రోతుతో పోల్చడం తెలిసిందే. ఈ సంప్రదాయం రగడ చాలా దూరమే వెళ్లింది. ఇక, ఇప్పుడు తాజాగా ప్రజావేదిక విషయంలోనూ సంప్రదాయం తెరమీదికి వచ్చింది.టీడీపీ అధినేత చంద్రబాబు ఏర్పాటు చేసుకున్న ప్రజావేదికను తమకే కేటాయించాలని విపక్షం హోదాలో చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే, దీనికి సంబంధించి జగన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదు. పైగా.. జగన్ ప్రభుత్వం తాజాగా ఎలాంటి సమాచారం లేకుండానే ప్రజావేదికను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి టీడీపీ సంప్రదాయం అనే విషయాన్ని తెరమీదికి తెచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు విపక్షనేత.,. సదరు
ప్రజావేదికను తమకే కేటాయించాలని కోరినా.. ఎలాంటి సమాధానం చెప్పకుండానే .. ఇప్పుడు ఇలా కనీసం సమాచారం ఇవ్వకుండా స్వాధీనం చేసుకోవడమేంటని, ఇదేం సంప్రదాయమని టీడీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు.అయితే, రాజకీయాల్లో సీనియర్ అయిన మాజీ సీఎం చంద్రబాబుకు ప్రభుత్వం ఊడిపోగానే ప్రజావేదికను ఖాళీ చేయాలనే సంప్రదాయం తెలియదా? అని వైసీపీ నాయకులు రగడకు దిగుతున్నారు. అదేసమయంలో ప్రజావేదికను ఏమన్నా టీడీపీ అధినేత చంద్రబాబు సొమ్ముతో కట్టించారా? అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ అన్ని సంప్రదాయం అనే పదం చుట్టూ తిరుగుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో.. ఈ సంప్రదాయ రగడ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి