యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీలో ప్రభుత్వం మారింది. పాలన మారింది. తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత జగన్.. అధికారంలోకి వచ్చారు. వచ్చీ రావడంతోనే ఆయన మెరుపులు మెరిపించారు. సంక్షేమ పథకాలు, నవరత్నాలు వరుస వెంబడి ప్రకటిస్తున్నారు. అమలు చేస్తున్నారు. ఇది ఒక భాగం. అయితే, ఇప్పుడు రాష్ట్రంలోని అధికారుల్లో సరికొత్త చర్చ ప్రారంభమైంది. “ఆయన బాబు మాదిరి కాదు..“ అని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఏపీ ఐఏఎస్ అధికారుల సర్కిల్స్‌లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ఇంతకు వాళ్లు చర్చించుకుంటోన్న వ్యక్తి ఎవరో కాదు.. ఏపీ సీఎం జగన్. అదేంటి ? అనుకుంటున్నారా ? ఫ్రెండ్లీ సర్కార్ ఏర్పాటు చేశానని చెప్పిన జగన్‌కు అధికారులు భయపడుతున్నారా? అంటే అదేమీ లేదు..!అధికారులు భయపడడం లేదు. కానీ, భయంలాంటి భక్తితో ముందుకు సాగుతున్నారు. గతం ప్రభుత్వంలో చంద్రబాబు అధికారులపై కేకలు, వార్నింగులు అందరికీ తెలిసిందే. ఆయన ఏం అన్నా మీడియా ముఖంగానే చెప్పేవారు. దీంతో తప్పు చేసిన అధికారులు సహా తప్పు చేయని అధికారులు కూడా భయంతో అల్లాడిపోయేవారు. ఎలాగూ తిట్టు తప్పవని తెలిసి.. అందిన కాడికి అవినీతిలో పొర్లేవారన్న టాక్ బాగా వచ్చేసింది. దీనిని ప్రశ్నించిన వారికి కూడా ఎంతో కొంత ముట్టజెప్పేవారు.అయితే, ఏపీ సీఎం జగన్ ఇప్పుడు ఈ సంస్కృతిని పక్కకు పెట్టితనదైన శైలిలో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆయన అధికారులను అన్నా అని పిలుస్తున్నారు. దీంతో అధికారులు ఉత్సాహంతో తమ పని తాము చేసుకుపోతున్నారు. అదే సమయంలో అవినీతిపై మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయని, చర్చలు మాత్రం ఉండబోవని చెబుతున్నారు. ఆయా విషయాలను ఏపీ సీఎం జగన్ ఎక్కడా మీడియా ముందుకు వచ్చి అధికారులపై రంకెలు వేయడం లేదు. చేయాల్సిందంతా నాలుగుగోడల మధ్యే చేసేస్తున్నారు.గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఉన్నవారిని కీలక స్థానాల నుంచి ఇప్పటికే ఒక సారి తప్పించారు. ఇప్పుడు మరింత పారదర్శకతకోసం మరోసారి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. అంతేకాదు, నిజాయితీతో పనిచేసే అధికారులను సన్మానాలు చేస్తానని ప్రకటించడం ద్వారా మరింతగా వారికి చేరువయ్యారు. దీంతో జగన్ ను ద్వేషించే అధికారులు అంటూ ఎవరూ లేకుండా పోయారు. ఆయనంటే భయంతో కూడిన భక్తితో పనులు చేస్తున్నవారే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ అంటే లైట్ కాదు సీరియస్సే.. అని సచివాలయంలో అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.