యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ కామధేను పునరుత్పత్తి(చింతలదేవి క్షేత్రంలో ఓ భాగం) కేంద్రానికి నీటి ఎద్దడి పొంచి ఉంది. దేశానికి, రాష్ట్రానికి, నెల్లూరు జిల్లాకు కూడా ప్రత్యేకమైన గుర్తింపుగా నిలిచింది. ఈ కేంద్రం ద్వారా స్వదేశీజాతి పశువులను అభివృద్ధిచేసి రైతులకు అందించే లక్ష్యంగా నడుస్తుంది. విలువైన, నాణ్యమైన స్వదేశీజాతి పశువులను వివిధ రాష్ట్రాల నుంచి ఏపీ లైవ్‌స్టాక్ వైద్యులు, అధికారులు క్షేత్రానికి తీసుకొచ్చారు. మెట్టప్రాంతం కావడంతో వీటి జీవనానికి అవసరమైన తాగునీటికి సమస్య మళ్లీ తలెత్తే ప్రమాదం ఏర్పడింది. గడ్డిపెంపకం కూడా ప్రశ్నార్థకంగా మారింది. గతంలో అధికారులు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. బోర్లు వేసినా కొన్ని సంవత్సరాలుగా వర్షాలు లేకపోవడంతో భూగర్భజలాలు
అడుగంటిపోయాయి. ఉప్పుటేరు నుంచి చింతలదేవి మీదుగా రాళ్లపాడు జలాశయానికి ఉత్తరకాలువ ద్వారా సోమశిల జలాలను విడుదల చేస్తున్నారు. రాళ్లపాడుకు వెళ్లే 1.5 టీఎంసీల నీటిలో 7.884 ఎంసీఎఫ్‌టీ అంటే సుమారు 50ఎకరాలకు సరిపోయేంత నీటిని పైపులైన్ ద్వారా పశువులకు ఇవ్వాలని నిర్ణయించి గత ప్రభుత్వం హయాంలో జీవో విడుదల చేశారు. ప్రస్తుతం పైపులైను పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం మారాక కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి రాళ్లపాడుపై ప్రకాశం జిల్లా రైతులతో ఇటీవల సమావేశం ఏర్పాటుచేసి ఆ పనులను నిలిపివేయాలని ధర్నా చేశారు.దీంతో పనులు కాస్తా నిలిచిపోయాయి. అంతేకాకుండా జీవోను కూడా రద్దుచేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం చింతలదేవి క్షేత్రంలో 17 రకాలు పశువులకు సంబంధించి 370 యూనిట్లు పెంపకంలో ఉన్నాయి. క్షేత్రంలో ఏర్పాటు చేసిన బోర్ల ద్వారా నీరు వీటికి సరిపోవడం లేదు. వస్తున్న నీళ్లు కేవలం పశువుల అవసరాలకే సరిపోతున్నాయి. గడ్డిపెంచేందుకు వీలులేకుండా పోయింది.దీంతో స్థానిక రైతుల నుంచి గడ్డిపెంచి క్షేత్రానికి ఇచ్చే విధంగా అనుమతులు తీసుకున్నారు. వంద ఎకరాల భూమిలో గడ్డిపెంచితేకాని ఇక్కడి పశువులకు సరిపోదు. అలాంటిది ప్రస్తుతం వస్తున్న నీటితో 14 ఎకరాల్లోనే గడ్డిని పెంచుతున్నారు. రాళ్లపాడుకు నీరు తీసుకెళ్లే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, చింతలదేవి క్షేత్రానికి నీరు ఇచ్చే విషయంలో న్యాయంగా ఆలోచించాలని కొందరు రైతులు కోరుతున్నారు. కామధేను పశువులకు 50 ఎకరాల్లో పంటను పండించేంత నీరు మాత్రమే తీసుకోవడం జరుగుతుందని క్షేత్రంలోని అధికారులు తెలియజేస్తున్నారు. పంటను పండించేందుకు ఈ నీటిని తీసుకుపోవడం లేదని, కేవలం పశువుల అవసరాలకు, తాగునీటికే వినియోగించడం జరుగుతుందని
చెబుతున్నారు.