ఆంధ్రప్రదేశ్ లో బలపడే ప్రయత్నాల్లో భాగంగా బిజెపి కీలక అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ బలాన్ని తన వైపుకి తిప్పుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిన బిజెపి అధిష్టానం రాష్ట్రంలో పాగా వేయడానికి గాను సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలను బిజెపిలోకి ఆహ్వానించడానికి ఆ పార్టీ నేతలు వ్యూహాలు సిద్దం చేశారు. అందులో భాగంగానే తెలుగుదేశం ఎంపీలు నలుగురు ఇటీవల బిజెపి కండువా కప్పుకున్నారు.సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ ఇప్పటికే బిజెపిలో చేరిన వారిలో ఉన్నారు. ఇక అక్కడి నుంచి రాష్ట్రంలో కొంత మంది కీలక నేతలు పార్టీలోకి జాయిన్ అవ్వడానికి సిద్దమవుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ పార్టీ మారడానికి సిద్దమవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అలాగే రాయలసీమకు చెందిన పెద్ద కుటుంబాలని సైతం పార్టీ మార్చటానికి తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బిజెపి నేతలు వారితో చర్చలు కూడా జరుపుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి బిజెపిలో చేరే అవకాశాలు ఉన్నాయా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. చిరంజీవితో సోమవారం రాత్రి బిజెపి కాపు సామాజిక వర్గ నేతలు భేటి అయినట్టు విశ్వసనీయత సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్‌లో పార్టీలో ఉన్నా సరే ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ కి ప్రచారం చేయలేదు. ఏప్రిల్ 2018లో చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం ముగిసింది. ఇక గత కొంత కాలంగా సినిమాల మీద దృష్టి సారించిన ఆయన ప్రస్తుతం “సైరా నరసింహారెడ్డి” చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 74 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నేపధ్యంలో చిరంజీవిని పార్టీలోకి తీసుకుని ఆయన అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా బిజెపి భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాంమాధవ్, కన్నా లక్ష్మీ నారాయణ సహా కొందరు చిరంజీవితో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు ఆయనతో చర్చలు జరిపి పార్టీలోకి తీసుకునే అవసరం ఏముందని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.