ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం రుద్రామాంబపురంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రుద్రామాంబపురంలో మంగళవారం రాత్రి టీడీపీ-వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో టీడీపీ మహిళా కార్యకర్త పద్మ (28) మృతి చెందింది. తెలుగుదేశం కార్యకర్తల ఇళ్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఘర్షణ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కాగా.. వైసీపీ శ్రేణులు టీడీపీ నేతల ఇళ్లపై దాడి చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గీయుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.