ఓటమికి కృంగిపోవాల్సిన అవసరం లేదని, మన పక్షం ప్రజాపక్షమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 6వ డివిజన్‌లోని నాయీ బ్రాహ్మణ కమ్యూనిటీ హాలులో 6, 15, 30, 31 డివిజన్లకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్‌టీ రామారావు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఓటమి, ఇబ్బందులు పార్టీకి కొత్త ఏమీ కాదని, అనేకసార్లు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా ప్రజల పక్షాన పోరాటం చేసిందన్నారు. మహా నాయకుడు ఎన్టీఆర్ హయాంలోనే పార్టీ ఓడిపోయినా కార్యకర్తలు అనే సైన్యం వెన్నంటి ఉండి మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చిందన్నారు. పాలక ప్రభుత్వం చేపట్టే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యకర్తలందరికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసే దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని సత్వరం పరిష్కంచాలనే ఉద్దేశంతో తాము రూపొందించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి, స్థానిక సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అనేది ఎల్లప్పుడూ ప్రవహించే జీవనదన్నారు. ఓటమి వంటి ఆటుపోట్లను చాలానే చూసిందని, ఓటమి గురించి పట్టించుకోకుండా భవిష్యత్తు కార్యచరణ, ప్రజా సమస్యలపై పోరాటం సాగించాలన్నారు. అధికార పార్టీ తప్పులనే అస్త్రాలుగా చేసుకుని ప్రజలకు వివరించాలన్నారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో నిజంగా ఎవరు లభ్ధిపొందుతున్నారో గుర్తించి నిజమైన అర్హులకు అవి చేరని పక్షంలో ధైర్యంగా నిలదీయాలని పిలుపునిచ్చారు. మనం అధికారంలో లేనంత మాత్రాన ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదని, మంచి రోజులు ముందున్నాయన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి యర్రా వేణుగోపాలరాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎవరికీ భయపడే పార్టీ కాదన్నారు. ఆంధ్రుల ఆరాధ్యుడు, మహాను భావుడు ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీని మన నాయకుడు నారా చంద్రబాబునాయుడు ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయేలా చేశారని అన్నారు. వచ్చిన ఈ కొద్దిపాటి కష్టానికే కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) మాట్లాడుతూ ఆంధ్రుల విశ్వాసం చూరగొన్న పార్టీ టీడీపీ అని అన్నారు. మన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేసిన పథకాల ద్వారా కోట్లాది మంది లబ్ధిపొందారని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలను పక్కన పెట్టి... ఇకపై జరగనున్న ఎన్నికలపై దృష్టి పెట్టాలన్నారు. త్వరలో జరగనున్న రాజమండ్రి నగర పాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాలుగో సారి కూడా విజయం సాధించే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో తప్పనిసరిగా తెదేపా జెండాను రెపరెపలాడించాలన్నారు. ప్రజలతోనే ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, మజ్జి సత్యవేణి, తంగేటి సాయి, వాకా కృష్ణ శ్రీ, కీలపర్తి పరశురా, మస్తాన్ చౌదరి, తలారి భాస్కర్, నాయుడు మాస్టర్, మలే విజయలక్ష్మి, టీవీలు రాము, నీలాపు వెంకటేశ్వరరావు, మజ్జి సోమేశ్వరవు, పీత చిన్ని, కర్రి రాంబాబు, కర్రి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.