ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రజా వేదిక చుట్టూ తిరుగుతోంది. అక్రమ నిర్మాణమంటూ.. ప్రజా వేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూల్చేయమని ఆదేశాలివ్వడంతో రాజకీయంగా హీట్ పెంచింది. జగన్ ప్రకటనపై టీడీపీ నేతలు మండిపడుతుంటే.. వైసీపీ నేతలు మాత్రం సమర్థిస్తున్నారు. రెండు రోజులుగా ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
ఇక విదేశాల నుంచి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు.. హైదరాబాద్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. బీజేపీలో ఎంపీల చేరిక, టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, ప్రజా వేదిక కూల్చివేతపై స్పందించారు. ముఖ్యంగా ప్రజా వేదిక కూల్చివేతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా వేదికను కూలగొట్టాలనుకోవడం సరైన నిర్ణయం కాదని.. వైఎస్ విగ్రహాలు అనుమతి లేకుండా ఏర్పాటు చేసినవేనని గుర్తు చేశారు. మరి ఆ విగ్రహాల సంగతేంటో చెప్పాలని పరోక్షంగా ప్రశ్నించారు. ఇక టీడీపీ కార్యకర్తలపై దాడుల్ని కూడా చంద్రబాబు ఖండించారు. ప్రకాశం జిల్లాలో దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. నర్సరావుపేట దళిత వైద్యులపై దాడిని ఖండిస్తున్నామన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై నెలరోజుల్లో 130కి పైగా భౌతిక దాడులు జరిగాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు చంద్రబాబు.