యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు 733 మంది ఉగ్రవాదులు చనిపోయారని... ఈ ఏడాది జూన్ 16 వరకు అందిన లెక్కల ప్రకారం 113 మంది హతమయ్యారని చెప్పారు. 18 మంది సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇదే సమయంలో జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలు మూడు రెట్లు పెరిగాయని వెల్లడించారు. ఉగ్రవాదం పట్ల కఠినంగా వ్యవహరించడమే తమ ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు. టెర్రరిజాన్ని అడ్డుకునేందుకు భద్రతా దళాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. ఉగ్రవాదులకు మద్దతిస్తున్న వారిపై కూడా ప్రత్యేక నిఘా ఉందని చెప్పారు. ఈ మేరకు లోక్ సభలో ఆయన వివరాలను వెల్లడించారు.