Highlights
టీడీఎస్ ను ఎగ్గొట్టిన 447 కంపెనీలు
వారంట్లను జారీ చేసిన ఐటి శాఖ
గరిష్ఠంగా ఏడేళ్ల వరకూ శిక్ష
దేశవ్యాప్తంగా కుంభకోణాల పరంపరం కొనసాగుతూనే ఉంది..ఒక పక్క జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ఈ స్కామ్ ల వ్యవహారం కుదిపేస్తోంది. మరో పక్క పుట్టగూడుగుల చందంగా ఈ కుంభకోణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా మరో భారీ కుంభకోణం బయటపడింది. ఆదాయపు పన్ను విభాగం దీన్నిబట్టబయలు చేసింది . ఇందులో మొత్తం 447 కంపెనీల ప్రమేయం ఉండగా, ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సుమారు రూ. 3,200 కోట్లను ఆయా కంపెనీల యాజమాన్యం నొక్కేసింది. ఉద్యోగుల నుంచి టీడీఎస్ (టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని ఈ కంపెనీలు ఐటీ శాఖకు చెల్లించలేదని చెబుతూ, ఈ కంపెనీలకు ఐటీ చట్టం ప్రకారం వారంట్లను జారీ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీల్లో అత్యధికం రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవి కాగా, వాటిల్లో ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధించిన కంపెనీలు కూడా ఉన్నాయని ఐటీ వర్గాలు వెల్లడించాయి. ఓ రాజకీయ నేత సంస్థ దాదాపు రూ. 100 కోట్లను ఉద్యోగుల నుంచి టీడీఎస్ రూపంలో కట్ చేసుకుని, ప్రభుత్వానికి కట్టకుండా వ్యాపార అవసరాలకు తరలించినట్టు తేలిందని తెలిపాయి. ఈ 447 కంపెనీల్లో సినీ నిర్మాణ సంస్థలు, మౌలిక రంగంలోని కంపెనీలు, స్టార్టప్ సంస్థలు ఉన్నాయని సమాచారం. ఓ మౌలిక సంస్థ రూ. 14 కోట్లను ఎగ్గొట్టగా, మరో ఐటీ సేవల సంస్థ రూ. 11 కోట్లను చెల్లించలేదని ఐటీ అధికారి ఒకరు తెలిపారు. 'ఏప్రిల్ 2017 నుంచి మార్చి 2018' మధ్య వసూలు చేసిన టీడీఎస్ నుంచి ఈ 3,200 కోట్లు కేంద్రానికి రావాల్సి వుందని, ఈ కంపెనీలపై చట్టపరమైన చర్యలుంటాయని ఆయన వెల్లడించారు. ఆరోపణలు రుజైవైతే ఈ కంపెనీల యజమానులకు గరిష్ఠంగా ఏడేళ్ల వరకూ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.కాగా, ఈ కంపెనీలపై మోసం, నమ్మకద్రోహం సెక్షన్లను కూడా జోడించాలని ఐటీ అధికారులు భావిస్తున్నారు.