యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేజిక్కించకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమౌతోంది. జూలై నెల 11వ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. జూలై 11న దశమి. ఇది మంచి రోజు కావడంతో బడ్జెట్ సమావేశాలు అదే రోజున ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జూలై 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మొట్టమొదటి సారిగా అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. బడ్జెట్ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 25 రోజులు కూడా జరపొచ్చనే అంచనాలున్నాయి. ఈ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ సారి బడ్జెట్‌లో నవరత్నాల అమలుకు అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశముంది. నవరత్నాల్లోని 60 శాతానికిపైగా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గం ఆమోదం తెలిపిన నవరత్నాల్లోని అంశాలకు బడ్జెట్‌లో తగిన కేటాయింపులు జరగొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వచ్చే నెల 1,2 తేదీల్లో అన్ని శాఖల మంత్రులతో ఈయన సమావేశం కానున్నారు. ఇకపోతే బడ్జెట్‌లో రైతు భరోసా, అన్నదాతలకు సున్నా వడ్డీకే రుణాలు, పంట బీమా కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వంటి వాటికి కేటాయింపులు ఉండొచ్చని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఇకపోతే టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆవిష్కరించబోతోంది. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వపు తొలి బడ్జెట్ కావడంతో దీనిపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.