యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఇప్పటికే దెబ్బమీద దెబ్బలతో ఇబ్బంది పడుతున్న విపక్షం తెలుగుదేశం లో నేతల అసంతృప్తి మరో కీలక వివాదం దిశగా నడుస్తోందా? పార్టీలో తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని, తమను పట్టించుకోలేదని, అధికారంలో ఉన్నప్పుడు కనీసం తమ మాటను వినేందుకు కూడా అ వకాశం కల్పించలేదని కొందరు నాయకులు ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీ కష్ట కాలంలో ఉంటే.. మేమెందుకు మాట్లాడాలి? మేమెందుకు మాటలు పడాలి? అనే ధోరణి చాలా మంది నాయకుల నుంచే వినిపిస్తోంది. మొత్తానికి ఈ పరిణామం.. తెలుగుదేశం లో కలకలం సృష్టిస్తోందని తెలుస్తోంది.ఏపీలో ప్రధాన విపక్షంగా ఉన్న టీడీపీకి అటుకేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి కూడా సెగలు ప్రారంభమయ్యాయి. సాధ్యమైనంతగా చంద్రబాబును తెలుగుదేశం ని బలహీన పరచాలనే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. నైతికంగా దెబ్బతీయడం ద్వారా తాము అనుకున్నది సాధించాలనే రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే నలుగురు రాజ్యసభ సభ్యులను పార్టీలో చేర్చుకుని బీజేపీ విలీనం ప్రకటన చేయించింది. ఇక, రాష్ట్రంలో చంద్రబాబు కోరినప్పటికీ.. ప్రజావేదిక విషయంలో ప్రభుత్వం సైలెంట్‌గా తన పనితాను చేసేసి.. మాజీముఖ్యమంత్రిగా చంద్రబాబు గాలి తీసేసింది. ఇక, కాపు నాయకులు వేర్వేరేగా సమావేశాలు పెట్టారు.మరోపక్క,రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల నుంచి తెలుగుదేశం కార్యకర్తలకు దాడులు , నిర్బంధాలు కూడా ఎదురవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా రాష్ట్రంలోను, దేశంలోను లేని సమయంలో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిమీద ఉంది? అనే ప్రశ్నకు ఖచ్చితంగా గత ప్రభుత్వంలో పదవులు అనుభవించిన వారికేనని చెప్పడంలో సందేహం లేదు. అయితే, మరి అలా పదవులు, నామినేటెడ్ పోస్టులు పొంది, అనుభవించిన ఎంతమంది.. ఇప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా రోడ్డెక్కుతున్నారు? ఎంతమంది పార్టీ కోసం నిజంగా తమ గళాన్ని వినిపిస్తున్నారు? అంటే ప్రశ్నార్థకంగానే ఉంది.అయితే, తెలుగుదేశం లోని కీలక నేతలు ఇలా మౌనంగా ఉండిపోయేందుకు ప్రభుత్వం నుంచి ఎదురైన బెదిరింపులో.. పోలీసు ల నుంచి వచ్చిన కేసుల హెచ్చరికలో కాదు. కేవలం పార్టీపై అసంతృప్తే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో తమ మాటను ఎవరూ పట్టించుకోలేదని, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని వివరించినా ఎవరూ వినలేదని, తమను చీడపురుగుల్లా చూసి, ఓ కోటరీ చెప్పినట్టు నడుచుకున్నారని, ఇప్పుడు మాత్రం మాతో పనేంటని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి టీడీపీకి దెబ్బమీద దెబ్బ పడిపోతోందంటే అంతా స్వయంకృతమేనని అంటున్నారు పరిశీలకులు.