యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియ జోరందుకోనుంది. జూలై 15న కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టనున్న ఏపీ ప్రభుత్వం... సెప్టెంబర్ 15 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులు సన్నాహాలు కూడా మొదలుపెట్టినట్టు సమాచారం. ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను మొదలుపెట్టాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు తోడు కొత్తగా 12 జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం 25 లోక్ సభ నియోజకవర్గాలను 25 జిల్లాలుగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న వైసీపీ... పార్టీ పరమైన పదవులను కూడా ఇదే ప్రాతిపదికన భర్తీ చేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్న వైసీపీ సర్కార్... ఈ ప్రక్రియ పూర్తయిన తరువాతే పరిషత్ ఎన్నికలు జరపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తయిన తరువాత నవంబర్‌లో పరిషత్ ఎన్నికలు ఉండే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త జిల్లాలకు సంబంధించిన పేర్లను కూడా లోక్ సభ నియోజకవర్గాల పేర్లతోనే కొనసాగించాలని జగన్ నిర్ణయించారని... మచిలీపట్నం సహా ఒకటి రెండు జిల్లాల పేర్లను మాత్రమే మార్చే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి కాస్త అటు ఇటుగా దసరా నాటికి ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది.