ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు అమలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియను పూర్తి చేశారు. ఐపీఎస్ లతో సీఎం జగన్ సమావేశం ముగిసిన తర్వాత కూల్చివేత ప్రక్రియ షురూ చేశారు. ప్రజావేదిక కూల్చివేయటంతో అక్రమ నిర్మాణాలపై తమ ప్రభుత్వవైఖరి ఎలా ఉండనుందన్న విషయాన్ని జగన్ సర్కారు స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. ప్రజావేదిక కూల్చివేత సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం విదేశీ పర్యటన అనంతరం హైదరాబాద్ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. రాత్రి వరకూ హైదరాబాద్ లోనే ఉన్నారు. రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్నారు.ఈ సందర్భంగా ఆయనకు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. ప్రజావేదిక కూల్చివేతపై టీడీపీ నేతలు..కార్యకర్తలు భావోద్వేగాన్ని ప్రదర్శించారు. ఎన్నికల ఫలితాల ముందు నిత్యం సమీక్షలు.. సమావేశాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రజావేదికను కూల్చి వేయటంపై
ఎమోషన్ అయ్యారు.ఆసక్తికర విషయం ఏమంటే.. ఉదయం నుంచి హైదరాబాద్ లో ఉన్నప్పటికి.. సరిగ్గా కూల్చివేత సాగుతున్న సమయంలో ప్రజావేదిక పక్కనే ఉండే తన నివాసానికి వెళ్లటం ద్వారా హైడ్రామా సృష్టించే ప్రయత్నం చేశారు. దీనికి తగ్గట్లే సరిగ్గా అర్థరాత్రి 12 గంటల సమయానికి తన నివాసానికి చేరుకున్నారు. ఆయన తన నివాసానికి వెళుతున్నవేళలోనే.. ప్రజావేదిక కూల్చివేత పనులు జోరుగా సాగుతున్నాయి. ఓపక్క కూల్చివేతలు సాగుతుండగా.. వాటిని చూస్తూ బాబు తన నివాసానికి చేరుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా బాబు వాహన శ్రేణి మినహా.. మిగిలిన వారందరిని పోలీసులు అడ్డుకున్నారు.