YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సైరాలో అనుష్క కు గాయాలు

సైరాలో అనుష్క కు గాయాలు

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. రాయలసీమ పోరాటయోధుడు, తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో అనుష్క శెట్టి అతిథి పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆమె సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. సినిమాకు కీలకమైన ఒక సన్నివేశంలో అనుష్క నటిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె కాలికి గాయమైందట. అయితే, ఈ విషయం బయటికి రాకుండా ‘సైరా’ చిత్ర యూనిట్, అనుష్క జాగ్రత్త పడ్డారని సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా అనుష్క హాస్పిటల్‌కు వెళ్లి వైద్యం చేయించుకున్నారని, కాలికి ఫ్యాక్చర్ కావడంతో డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని చెప్పారని తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో ప్రమాదాలు ఎక్కువయ్యాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగశౌర్య, శర్వానంద్, సందీప్ కిషన్ షూటింగ్ సమయంలో గాయపడ్డారు. అంతేకాదు, వీరి గాయాల కారణంగా షూటింగ్‌లు కూడా నిలిచిపోయాయి. ఈ క్రమంలో అనుష్కకు కూడా గాయమంటే ఇది కూడా పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయిపోతుందని బహుశా దాచి ఉంచారనుకుంటా! ఏదేమైనా ఈ గాయం నుంచి అనుష్క త్వరగా కోలుకుని మళ్లీ షూటింగుల్లో పాల్గొనాలని కోరుకుందాం. అనుష్క ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘సైలెన్స్’ అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. కాగా, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా భారీ తారాగణంతో అత్యంత భారీగా తెరకెక్కుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, నయనతార, తమన్నా వంటి స్టార్లు నటించారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది మ్యూజిక్ సమకూరుస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. సాయిమాధవ్ బుర్రా డైలాగులు రాశారు.

Related Posts