రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయింది. కర్ణుడు చావుకు కోటి కారణాలు అన్నవిధంగా పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే, ప్రధానంగా టీడీపీలోని కొందరు నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ను టార్గెట్ చేసుకున్నారు. ఆయనవల్లే పార్టీకి ఇలాంటి గతి పట్టిందని అంటున్నారు. ముఖ్యంగా తమకు- పార్టీ అధినేతకు మధ్య గ్యాప్ పెంచడం, అన్ని విషయాల్లోనూ ఆయన జోక్యం పెరగడం వంటివి టీడీపీ ఓటమికి కారణాలుగా కనిపిస్తున్నాయని ఆ నాయకులు పేర్కొంటున్నారు. ఇటీవల విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నాని కూడా దేవినేనిని పరోక్షంగా దెప్పి పొడిచారు. “కొడాలి నాని మంత్రి అయ్యేందుకు కారణమైన దేవినేని ఉమాకు రుణపడిపోవాలి“అని ఫేస్‌బుక్ వేదికగా నాని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు.ఇక, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అవనిగడ్డ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మండలి బుద్ద ప్రసాద్ వంటివారు కూడా దేవినేని ఉమామహేశ్వరరావు పై కారాలు మిరియాలు నూరుతున్నారు. పార్టీలో తమ వాయిస్‌నువినిపించకుండా చేసి, తనే అన్నీ అయినట్టు వ్యవహరించడం వల్లే పార్టీ నేడు మట్టికొట్టుకు పోయిందని నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, ఇదే సమయంలో విజయవాడ సెంట్రల్ నుంచి ఓడిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమా.. తాజాగా స్పందించారు. ఈ క్రమంలోనే ఆయన కూడా దేవినేనిపై విరుచుకుపడ్డారు. అప్పటి మంత్రుల్లో కొందరు ఓ భజన బృందంలా తయారయ్యారని ఆరోపించారు. ప్రతి చిన్న విషయానికీ భజన చేసి చంద్రబాబుకు నిజాలు తెలియకుండా చేశారని మండిపడ్డారు.క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అధినేత దృష్టికి తీసుకెళ్లలేదని, కార్యకర్తలను చంద్రబాబుకు దూరం చేశారని దుయ్యబట్టారు.మొత్తానికి బొండా వ్యాఖ్యల్లోనూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పై అక్కసు బయట పడింది. ఈ క్రమంలో ఆయన మనసులోని మాటలను దాచుకోకుండా చెప్పేశారు. వాస్తవానికి దేవినేని మంత్రిగా ఉన్న సమయంలో ఇలానే వ్యవహరించారనేది వాస్తవం. పట్టిసీమ బాధ్యతలను, పోలవరం బాధ్యతలను కూడా చంద్రబాబు తనకే అప్పగించడంతో ఇక, ఆయన నేనే నెంబర్-2 అనుకునే రేంజ్‌లో రాజకీయం చేశారు.ఇక కృష్ణా జిల్లాలో ఎవరెన్ని చెప్పినా చంద్రబాబు, లోకేష్ దేవినేని ఉమామహేశ్వరరావు మాటలనే నమ్మేవారు. ఐదేళ్లు ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఉమా ఎంత చెపితే అంత అన్నట్టుగా ఉండేది. మంత్రిగా ఉన్న ఉమా ఇతర ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో వారు ఇప్పుడు పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో దేవినేని ఉమామహేశ్వరరావు నే టార్గెట్‌గా చేసుకుంటున్నారు. ఇక జిల్లాలో టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా ఉమాపై నేరుగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తాము గెలిచామని… తమ మాటకు విలువ ఇవ్వకపోతే తమ దారి తాము చూసుకుంటామని కూడా అధిష్టానానికి హెచ్చిరికలు జారీ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఉమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.