యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అంగారక గ్రహంపై భారీగా మీథేన్ వాయువు ఉన్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ గుర్తించింది. లేజర్ స్పెక్ట్రోమీటర్ ద్వారా అరుణ గ్రహంపై రోవర్ జరిపిన పరిశోధనల సమాచారాన్ని నాసా శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. అంగారకుడిపై ఉన్న వాతావరణంలో వంద కోట్లలో 21 ప్రమాణాల (యూనిట్లు) మీథేన్ వాయువు ఉన్న ట్లు అంచనా వేశారు. ఇంత పెద్ద పరిమాణంలో ఈ వాయువు ఉంటే అంగారకుడిపై తప్పక జీవరాశి ఉండే ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భూమిపై మీథేన్ ఆధారంగా కొన్ని సూక్ష్మజీవులు మనుగడ సాగించడమే దీనికి నిదర్శనంగా వారు భావిస్తున్నారు. ఈ మీథేన్ మూలం ఏమిటో శాస్త్రవేత్తలకు అంతుబట్టడం లేదు. కొన్ని సమయాల్లో నమోదవుతున్న మీథేన్ వాయువు హెచ్చుతగ్గులపై భిన్న కోణాల్లో పరిశోధనలు చేస్తున్నారు. దీని కోసం క్యూరియాసిటీ రోవర్ గతంలో పంపిన సమాచారం విశ్లేషిస్తున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించిన ట్రేస్ గ్యాస్ ఆర్బిటార్ అంగారకుడి చుట్టూ పరిభ్రమిస్తున్నది. దీని సమాచారంతోపాటు గ్రహంపై క్యూరియాసిటీ రోవర్ పరిశోధనలను క్రోడీకరించిన తర్వాతే అంగారకుడిపై మీథేన్ వాయువు ఉనికిని నిర్ధారించడంతోపాటు దాని మూలం తెలిసే అవకాశముందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.