యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, టాలీవుడ్ ప్రముఖ నటి, ప్రముఖ దర్శకురాలు విజయనిర్మల (73) బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. బుధవారం నాడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స గుండెపోటుతో పొందుతూ మరణించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్‌బుక్ రికార్డుల్లో చోటు దక్కించుకున్న విజయనిర్మల మృతిపట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు సోషల్‌మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. ‘మిస్ యు నన్నీ అంటూ.. మీరు వచ్చారు.. చరిత్ర సృష్టించారు. మీలాంటి నటన ఇంకెవరకీ సాధ్యం కాదు.. మీలాంటి వ్యక్తులు మళ్లీ రారు. ఈరోజు మీరు మమ్మల్ని వదిలివెళ్లడం మాకు తీవ్ర విషాదం.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నా’ - మంచు మనోజ్ విజయనిర్మల గారు చనిపోయారని సడెన్‌గా విన్నాను. విజయనిర్మల మరణం సినీ పరిశ్రమకు, ఆమె కుటుంబానికి తీరని లోటు.- హీరో నితిన్
జగన్, కేసీఆర్ నివాళి.. అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నీస్‌బుక్ రికార్డుల్లో స్థానం సాధించిన విజయనిర్మల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. విజయనిర్మల కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న విజయనిర్మల బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. విజయ నిర్మల పార్థివ దేహాన్ని గురువారం ఉదయం 11 గంటలకు నానక్ రామ్ గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకొస్తారు. బంధువులు, అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని రోజు మొత్తం అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌కు తరలిస్తారు. అనంతరం ఆమె అంతిమయాత్ర చేపట్టి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.