యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఇంటర్మీడియట్ పరీక్షలు, మూల్యాంకనం విధానంలో సంస్కరణలు తీసుకొస్తామని విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. మూల్యాంకనం చేసేవారికి నిబంధనలు, విధులు, బాధ్యతలు తెలుపుతూ తయారుచేసిన అంగీకారపత్రంపై సంతకంచేయించే విధానాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. దీనివల్ల బాధ్యతగా జవాబుపత్రాలను దిద్ది, సరైన మార్కులు వేయడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పాఠశాలవిద్యలో సెమిస్టర్ విధానాన్ని అమలుచేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని, దీనిపై ఇప్పటికే సీఎం కార్యాలయం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థుల్లో వార్షికపరీక్షల ఒత్తిడి తగ్గిపోతుందని.. ప్రతి ఆరునెలలకు ఒకసారి పరీక్షలకు ప్రిపేర్‌కావడం వల్ల చదువులపట్ల ఆసక్తి పెరుగుతుందని వివరించారు. పాఠశాల విద్యాశాఖలో త్వరలోనే ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడానికి ప్రభు త్వం అంగీకరించిందని జనార్దన్‌రెడ్డి తెలిపారు. పదోన్నతులు పాత జిల్లాల ప్రకారం ఇవ్వాలా? కొత్త జిల్లా ప్రకారం కల్పించాలా? అన్న అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. పది జిల్లాలకు సంబంధించిన అంశంపై కోర్టులో కేసు ఉన్నదని, దీనికి పరిష్కారం చూపించి, పదోన్నతులు ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు.