యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పోలవరం ప్రాజెక్టుసు సంబంధించి పునరావాస కాలనీల నిర్మాణాలు ఆశించిన స్థాయిలో జరగక పోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రానున్న నెల, నెలన్నర రోజుల్లో గోదావరికి వరద రానుంది. ఈలోపు ముంపునకు గురయ్యే గ్రామాలను తరలించాల్సి ఉంది. దీంతో అధికారులు ఏం చేయాలా? అన్న ఆలోచనలో పడ్డారు. ప్రత్యామ్నాయ అవకాశాలు ఏమిటన్నది కూడా పరిశీలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మొత్తం 12,406 కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయి. 41.5 కాంటూరు వరకు ముంపునకు గురవుతున్న 9,522 కుటుంబాలను గుర్తించారు. 45 కాంటూరు పరిధిలో ఉండే మరో 863 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. మొత్తంగా 10385 ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి ప్రణాళికలు
రూపొందించారు. ఈ కుటుంబాల కోసం జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, కుక్కునూరు, పోలవరం, గోపాలపురం మండలాల్లో గిరిజనులకు ఇళ్లను నిర్మిస్తున్నారు. గిరిజనేతరులకు జంగారెడ్డిగూడెం మండలంలోని చల్లావారిగూడెంలో కాలనీలు నిర్మిస్తున్నారు. ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటివరకు 128 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. జులై 15 నాటికి 500 ఇళ్లు పూర్తిచేయగలమని అధికారులు చెబుతున్నారు. వరదముంపునకు గురయ్యే గ్రామాలను తరలించాలన్నా ఇతర మౌలిక వసతులు నిర్మాణం చేపట్టాలి. అవన్నీ ఇప్పట్లో అయ్యేలా లేదు. గత కొన్నేళ్లలో వచ్చిన వరదల ఆధారంగా ఈ ఏడాది 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని జలవనరుల శాఖాధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యే గ్రామాల్లో కొన్నింటికి రాకపోకలు నిలిచిపోతాయని అంచనా వేస్తున్నారు. అలాంటి గ్రామాలన్నింటికీ వరద సమయంలో పునరావాసం కల్పిస్తామని చెబుతున్నారు. ఎక్కువ వరద వచ్చినా వారం
రోజులు మించి ఉండదు కాబట్టి ఆ వారం రోజులూ నిర్వాసితులకు పునరావాసం కల్పించే ప్రణాళికలో అధికారులు ఉన్నారు. అధికారులు భావించినట్లు తక్కువ రోజులే వరద ఉంటే ఈ ఏడాదికి గట్టెక్కినట్లే. ఎక్కువ రోజులు వరద వస్తే పరిస్థితి ఏంటనేది అర్థం కాని పరిస్థితి. దానికితోడు ప్రాజెక్టు నిర్మాణం కారణంగా
రహదారులన్నీ చిందరవందరగా తయారయ్యాయి. వరద వస్తే ముంపు గ్రామాలకు పోలవరం దాటి వెళ్లే అవకాశమే లేదు. పడవలను ఆశ్రయించాలి. గోదావరి గట్టున ఉండేవాటికి కొంతవరకు వెసులుబాటు ఉన్నా కొండలపై ఉండే వారి దగ్గరకు వెళ్లడం ఇబ్బందిగా మారుతోందని చెబుతున్నారు. కాపర్ డ్యాం మొదటి రీచ్‌లో 200 మీటర్ల వరకు 18 మీటర్ల ఎత్తు వరకు నిర్మించారు. రెండో రీచ్‌లో 1400 మీటర్ల పొడవునా 35 మీటర్ల ఎత్తు వరకు, మూడో రీచ్‌లో 360 మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణం చేపట్టలేదు. వరదకు దెబ్బతినకుండా ఉండేలా కాపర్‌డ్యాం రక్షణ చర్యలు చేపట్టారు. నీరు పారేచోట రక్షణ గోడలు నిర్మించారు. వరద వడి ఎక్కువగా ఉంటే ఇది నిలుస్తుందా? లేదా అనేది తేలాల్సి ఉంది.