యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తు నివాసంపై కూడా వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రజావేదికను కూల్చేసిన ఏపీ ప్రభుత్వం, కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలను సైతం తొలగిస్తామని సంకేతాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో మరో ఇంటికి మారిపోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే రంగంలోకి దిగిన తెలుగుదేశం నేతలు, చంద్రబాబు అవసరాలకు తగ్గ ఇంటిని వెతికే పనిలో బిజీగా మారిపోయారు. చివరికి వెలగపూడిలో 90 ఏళ్ల పాతదైన ఇంటిని టీడీపీ నేతలు ఎంపిక చేశారు. ఈ పెంకుటిల్లును చంద్రబాబుకు ఇచ్చేందుకు వెలగపూడి మాజీ సర్పంచ్ శాంతమ్మ సంతోషంగా అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఈ ఇంటిని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పరిశీలించారు. మండువా లోగిలి, పచ్చటి చెట్లతో ఈ ఇల్లు బాగుందని ఆయన కితాబిచ్చారు. అయితే ఈ ఇంటిలోకి చంద్రబాబు ఎప్పుడు మారతారు? ఉండవల్లిలోని లింగమనేని గెస్ట్ హౌస్ ను ఖాళీ చేస్తారా? అన్న విషయమై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.