YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రజా ఉద్యమంగా జల సంరక్షణ-దేశవ్యాప్తంగా జూలై 1నుండి జలశక్తి అభియాన్ జూలై 1నుండి సెప్టెంబరు 15 వరకూ మొదటి దశ కార్యక్రమం

ప్రజా ఉద్యమంగా జల సంరక్షణ-దేశవ్యాప్తంగా జూలై 1నుండి జలశక్తి అభియాన్  జూలై 1నుండి సెప్టెంబరు 15 వరకూ మొదటి దశ కార్యక్రమం

దేశవ్యాప్తంగా నీటిఎద్దడి గల జిల్లాల్లో పెద్దఎత్తున నీటి సంరక్షణ కార్యక్రమాలను చేపట్టేందుకు జూలై 1వతేదీ నుండి జలశక్తి అభియాన్(జెఎస్ఏ) కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా చేపట్టనున్నట్టు కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఢిల్లీ నుండి ఆయన అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఈ అంశంపై వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిన్హా మాట్లాడుతూ... నేడు దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు అందని పరిస్థితులు నెలకొన్నాయని,  కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రజలు తాగునీటికై తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జల సంరక్షణను ఒక ప్రజా ఉద్యమంగా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమై జలశక్తి అభియాన్ కు శ్రీకారం చుట్టిందని అన్నారు. దేశంలో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న 255 జిల్లాల్లోని 1,092 బ్లాకుల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుందని,  ఈ కార్యక్రమ పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు కేంద్ర రాష్ట్రాలకు చెందిన ఒక సీనియర్ అధికారిని ఇన్ చార్జిగా నియమించడం జరుగుతుందని తెలిపారు. వీరంతా ఆయా జిల్లాల్లో జల సంరక్షణ, సమర్ధ నీటి పారుదల కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించి జిల్లా నీటి సంరక్షణ ప్రణాళికను రూపొందిస్తారని తెలిపారు. అలాగే ప్రతి రాష్ట్రంలో ఈ కార్యక్రమం పర్యవేక్షణకు ముఖ్య కార్యదర్శి స్థాయి ఒక సీనియర్ అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని కేబినెట్ కార్యదర్శి పికె సిన్హా సిఎస్ లను ఆదేశించారు.
 జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని రెండు దశలుగా చేపట్టడం జరుగుతుందని,  మొదటి దశను జూలై 1 నుండి సెప్టెంబరు 15 వరకు, రెండవ దశను అక్టోబరు 1 నుండి నంబరు 30వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా వెల్లడించారు. ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా చేపట్టి ప్రజలందరికీ నీటి సంరక్షణ ఆవశ్యకతపై పూర్తి అవగాహన కలిగించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ఉద్యమంలో సంబంధిత శాఖల అధికారులు, భూగర్భజల నిపుణులు, ఇంజనీర్లు, స్వచ్ఛంద సంస్థలు, ఇంజనీరింగ్, వ్యవసాయ తదితర కళాశాలల విద్యార్ధినీ విద్యార్ధులను పెద్దఎత్తున భాగస్వాములను చేయాలన్నారు.
ముఖ్యంగా ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమం కింద ఉపరితల జలసంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు,రూప్ టాప్ వాటర్ హార్వెస్టెంగ్ నిర్మాణాలు, నీటి కుంటలు, వాటర్ షెడ్డుల అభివృద్ధి, సాంప్రదాయ నీటి వనరులను పునరుద్ధరించడం, పెర్కులేషన్ ట్యాంకుల నిర్మాణం, కొండ ప్రాంతాల్లో గల్లీ ట్రెంచింగ్ వంటి పనులు పెద్దఎత్తున చేపట్టి నీటి సంరక్షణ కృషి చేయాల్సి ఉంటుందని కేబినెట్ కార్యదర్శి పికె సిన్హా పేర్కొన్నారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో నీటి సంరక్షణకు విభిన్న పథకాలు అమలు చేస్తున్నారని వాటన్నిటినీ ఇంటిగ్రేట్ చేసి ప్రతి నీటిబొట్టును సంరక్షించే విధంగా ఈజలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమం అమలులో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు నాయకత్వం వహించాలని సిన్హా ఆదేశించారు.
వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలు చేసి ప్రతినీటి బొట్టును సంరక్షించి భుమిలో ఇంకింపచేడం ద్వారా భూగర్భ జలమట్టాన్ని పెంచే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేబినెట్ కార్యదర్శికి వివరించారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించడంతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు ఇద్దరు ఇన్ చార్జి అధికారులను కూడా నియమించడం జరుగుతుందని సిఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వివరించారు.

Related Posts