కన్నకొడుకునే ఓ తల్లి నిర్ధాక్షిణ్యంగా హత్యచేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేయడం కేరళలో కలకలం రేపింది. పోలీసులు రెండు రోజుల వ్యవధిలోనే కేసు మిస్టరీని ఛేదించారు. కొళ్లాం జిల్లా పోలీసుల కథనం ప్రకారం.. జితూ జాబ్(14) తన తల్లి జయమోల్‌తో కలిసి కొళ్లాం జిల్లా నెడుంబనలో నివాసం ఉంటున్నాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న జితూ గత సోమవారం రాత్రి అదృశ్యమయ్యాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కేలు కొనుక్కునేందుకు షాపునకు వెళ్లిన కుమారుడు ఇంటికి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు జితూ కోసం అన్వేషించగా వారి ఇంటి సమీపంలో మృతదేహం ముక్కలు ముక్కలుగా పడి ముఖం కాలి ఉండటాన్ని గుర్తించారు.
అయితే తమకు శత్రువులెవరూ లేరని చెప్పడంతో కుటుంబసభ్యులపైనే పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో బుధవారం జితూ కుటుంబాన్ని విచారిస్తుండగా బాలుడి తల్లి చేతికి కాలిన గాయాలున్నట్లు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో పోలీసులు విచారించగా కుమారుడిని తానే హత్య చేసినట్లు నిందితురాలు అంగీకరించింది. సోమవారం తల్లితో గొడవపడ్డ తర్వాత జితూ గొంతునులిమి ఉపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తేలింది. జితూ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది జయమోల్. శవాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు కిరోసిన్ పోసి ముఖానికి నిప్పుపెట్టి కాల్చివేసినట్లు వెల్లడించిందని ఛతన్నూర్ ఎస్ఐ నిజర్ ఏ వివరించారు. హత్య చేసినట్లు అంగీకరించిన నిందితురాలు ఎందుకు హత్య చేసిందో మాత్రం బయటపెట్టడం లేదని సమాచారం.