యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు సమయానికి ఆఫీసుకు వచ్చి వెళ్లిపోతుంటారు. మరికొందరు మాత్రం ఇష్టం వచ్చినప్పుడు విధులకు హాజరవుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి అధికారులపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కొరడా ఝుళిపించారు. అధికారులంతా ఉదయం తొమ్మిదికల్లా కార్యాలయానికి రావాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీచేశారు. ఎవరైనా అధికారులు సమయానికి ఆఫీసుకు హాజరుకాకపోతే వారి జీతాల్లో కోతలుంటాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా సీఎం ఈ ఆదేశాలు జారీచేశారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి యోగి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల విషయంలో మరింత క్రమశిక్షణాయుతంగా వ్యవహరిస్తున్నారు. తప్పుడు ప్రవర్తన కలిగిన పోలీసులపై ఇటీవల సీఎం కఠిన చర్యలు చేపట్టారు. అటువంటివారిని ముందుగానే రిటైర్ చేయాలన్నారు.