యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
నవరత్నాల్లో భాగమైన అమ్మ ఒడి పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా వర్తింపజేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. విద్యాశాఖ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, పిల్లలు చదువుకునే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో రూ. 15 వేలు జమ చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రయివేట్ జూనియర్ కాలేజీలతోపాటు రెసిడెన్సియల్ కాలేజీలు, హాస్టళ్లలో ఉండి చదువుకునే వారికి కూడా అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది. జగన్ నవరత్నాల్లో అమ్మ ఒడి పథకం ఒకటనే సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే.. పిల్లలు చదువుకునే ప్రతి తల్లికీ రూ.15 వేలు అందజేస్తామని వైఎస్ఆర్సీపీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసింది. అందుకు తగ్గట్టుగానే.. అధికారంలోకి రాగానే నిర్ణయం తీసుకుంది. తొలుత ఈ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితం చేస్తారనే ప్రచారం జరిగింది. ఆర్థిక మంత్రి కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. కానీ సీఎంవో మాత్రం ప్రయివేట్ స్కూళ్లలో చదివే వారికి కూడా అమ్మ ఒడిని వర్తింపజేస్తామని తెలిపింది. తాజాగా అమ్మ ఒడిని ఇంటర్ విద్యార్థులకు కూడా వర్తింపజేస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారం తగ్గనుంది. ఆంధ్రప్రదేశ్‌లో నిరక్షరాస్యత సగటు 33 శాతం ఉంది. ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువ కావడంతో.. అక్షరాస్యత పెంచడం కోసం అమ్మ ఒడి పథకం దోహదం చేస్తుందని భావిస్తున్నట్టు జగన్ తెలిపారు.