రాజకీయాల్లో ఆయన కీలకమైన నాయకుడు. సుదీర్ఘ ప్రస్థానంలో అనేక మంది శిష్యులను కూడా తయారు చేసిన రాజకీయ యోధుడు. రాజకీయాలకే రాజకీయాలు నేర్పగల ఘనాపాటి. అయితేనేం.. తన మనసులో నిగూఢంగా పేరుకుపోయిన కోరికను నెరవేర్చుకోలేక పోయిన.. నిలువెత్తు అసంతృప్తికి నిదర్శనం..! ఆయనే గుంటూరు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంతరించుకుని, పేదల మనిషిగా పేరు తెచ్చుకున్న రాయపాటి సాంబశివరావు. రాయపాటి సోదరులు శ్రీనివాసరావు, సాంబశివరావులు ఇద్దరూ కూడా జిల్లాలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాయించుకున్నారు.కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైన రాజకీయ ప్రస్థానంలో అనేక మలుపులు తిరిగాయి. గుంటూరు జిల్లాలో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్నారు. పేదలకు అన్నివిధాలా సాయం చేయడంలోనూ రాయపాటి సాంబశివరావు తనకంటూ ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు.సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అజాత శత్రువుగా రాయపాటి పేరు సంపాయించుకోవడం గమనార్హం.రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన రాయపాటి.. తర్వాత కాలంలో కాంగ్రెస్‌ను విడిచి పెట్టి.. బయటకు వచ్చారు. 2014 వరకు కూడా కాంగ్రెస్‌లోనే రాయపాటి.. ఆ తర్వాత రాష్ట్ర విభజనను వ్యతిరేకించి టీడీపీలోకి వచ్చారు. వాస్తవానికి కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరించినా.. తన మనసులోని ప్రగాఢ కోరికగా మిగిలిపోయిన టీటీడీ చైర్మన్ పోస్టును ఆయన సొంతం చేసుకోలేక పోయారు. అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డిని కలిసి తన మనసులో కోరికను బయటకు పెట్టారు. అయినా కూడా వైఎస్ భూమన కరుణాకర రెడ్డికి ఆ పదివిని కట్టబెట్టారు. దీంతో అప్పట్లో రాయపాటి సాంబశివరావు కోరిక తీరకుండానే పోయింది. ఇక, విభజన నేపథ్యంలో పార్టీ మారిన ఆయన గుంటూరు ఎంపీ సీటు, టీటీడీ చైర్మన్ పదవి అడిగారు.చంద్రబాబు గుంటూరు సీటుపై అప్పటికే జయదేవ్‌కు హామీ ఇచ్చి ఉండడంతో రాయపాటి సాంబశివరావు ని నరసారావుపేటకు పంపారు. ఇక రాయపాటి కోరినట్టు చంద్రబాబు కూడా టీటీడీ చైర్మన్ పదవిని ఇవ్వలేక పోయారు. వాస్తవానికి టీటీడీ చైర్మన్ పదవిని ఇస్తే.. తాను ఎంపీ సీటుకు రాజీనామా చేస్తానని కూడా రాయపాటి ప్రకటించినా.. పట్టించుకున్న నాధుడు కనిపించలేదు. ఇక, తాజా ఎన్నికల విషయానికి వస్తే.. వృద్ధాప్య సమస్యలతో చంద్రబాబు అసలు టికెట్ ఇచ్చేందుకు కూడా వెనుకాడారు. అయినా కూడా రాయపాటి.. పట్టుబట్టి ఈ సీటును సంపాయించుకున్నారు. అయితే, వైసీపీ తరఫున నిలబడ్డ లావు శ్రీకృష్ణదేవరాయులు చేతిలో ఘోరంగా రాయపాటి ఓడిపోయారు. దీంతో మళ్లీ వచ్చే ఎన్నికల వరకు రాయపాటికి వెయిటింగ్ తప్పుదు. మరి ఆ తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారు? ఎవరు ఆయనకు టీటీడీ చైర్మన్ పదవిని ఇస్తారు ? అనే ప్రశ్నలు ఇంకా సశేషంగానే మిగిలాయి. ఇప్పటికే వయోఃభారంతో ఉన్న ఆయన ఇవే తనకు అఖరి ఎన్నికలు అని కూడా ప్రకటించారు. ఈ లెక్కన చూస్తే రాయపాటి జీవిత కాల కోరికతీరనట్టే