YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పొలం పనుల్లో రైతన్నలు

పొలం పనుల్లో రైతన్నలు

విజయనగరం జిల్లాలోని రైతన్నలు పొలం పనుల్లో నిమగమయ్యారు. ఎట్టకేలకు వర్షాలు కురవడంతో పుడమి తల్లి కాస్త చల్లబడింది. దీంతో ఇన్నాళ్లు అదును కోసం అన్నదాతలంతా హలం పట్టారు. ముఖ్యంగా వరి నారుమళ్లు సిద్ధం చేసే పనిలో నిమగమయ్యారు. జిల్లాలో సాధారణంగా జూన్‌ మొదటివారం నుంచి ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమౌతుంది. కానీ మూడు రోజుల క్రితం వరకు వర్షాలు కురవలేదు. అడపాదడపా కురిసినా మండుతున్న ఎండలకు ఆవిరైపోయే పరిస్థితి ఏర్పడింది. తాజాగా కురిసిన వర్షాలకు దుక్కికి అదును నిచ్చాయి. ఈ ఏడాది 4.5లక్షల ఎకరాల్లో వరి సాగుచేయవచ్చని అధికారులు అంచనా వేశారు. ఓవైపు విత్తనాల కోసం యాతన పడుతున్నప్పటికీ మరోవైపు అదును చిక్కడంతో పనిలో బిజీబిజీగా మారారు. ఈ ఏడాది 1001రకం విత్తనాల సరఫరా పూర్తిగా నిలిపివేయడం, ప్రత్యామ్నాయ విత్తనాలుగా చెప్తున్న ఎంటియు 1121రకం పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఏడాది 49శాతం విత్తనాలు అందుబాటులో ఉంచామని అధికారులు చెప్తున్నప్పటికీ ఏదో ఒకచోట రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా రాగి, కొర్ర, జొన్న, సజ్జ వంటి చిరుధాన్యాల సాగును ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యనిస్తోంది. ఇందుకోసం ఎఇఒ, ఎంపిఇల స్థాయిలో ప్రత్యేక లక్ష్యాలను నిర్థేశించింది. ప్రస్తుతం జిల్లాలో చిరుధాన్యాలు 5వేల ఎకరాలు సాగవుతోంది. మరో 4,500ఎకరాల్లో సాగువిస్తీర్ణం పెంచేందుకు నిర్ణయించారు. పెసలు, మినుము చెరో 5వేల ఎకరాల్లో సాగుచేయనున్నారు. అయితే, ఇప్పటి వరకు విత్తనాల ధరలు ఏ విధంగా ఉన్నాయనేది ప్రభుత్వం ఇంకా స్పష్టం చేయలేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎరువుల ధరలు కూడా పెరిగినట్టు వార్తలు వినవస్తుండడంతో రైతుల్లో ఆందోళన పెరిగింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 24వేల ఎకరాల్లో సాగవుతున్న పెట్టుబడిలేని వ్యవసాయాన్ని (జెడ్‌బిఎన్‌ఎఫ్‌) ఈ ఏడాది 40వేల ఎకరాలకు పెంచేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆహార భద్రత పథకంలో భాగంగా కేటాయించిన రూ.50కోట్లలో రూ.10కోట్లు విత్తనాలకు, సూక్ష్మపోషకాలకు రూ.5.5కోట్లు యాంత్రీకరణకు, మిగిలిన వ్యవసాయ యంత్రాలు, పనిముట్లకు కేటాయించారు. సూక్ష్మపోషకాల లోపం ఉన్న చోట జింకు, జిప్స్‌ం, బోరాన్‌ వంటి ఎరువులు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే 2లక్షల ఎకరాల్లో భూసార పరీక్షలు నిర్వహించారు.

Related Posts