Highlights
- బెంగళూరులో ట్రాఫిక్ సమస్యకు ముగింపు
- క్యాబ్ ధరల కంటే రెండింతలు ఎక్కవ
- హెలికాప్టర్ ట్యాక్సీలకు ఆసక్తి
- అనేక మంది సీట్లు బుకింగ్
బెంగళూరులో హెలికాప్టర్ ట్యాక్సీ సేవలు
బెంగళూరులో నిత్యం రద్దీ ట్రాఫిక్ సమస్యలతో కొన్ని గంటల ముందు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరకు బయలుదేరే విమాన ప్రయాణికులు ఇక ముందు ఆ సమస్య నుంచి బయటపడినట్టే. సోమవారం బెంగుళూరు విమానాశ్రయం నుంచి హోసూరు రోడ్డులోని ఎలక్ట్రానిక్ సిటీకి హెలికాప్టర్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మొదటి హెలికాప్టర్ ట్యాక్సీలు విహరించింది. కేవలం 15 నిమిషాల్లో చేరుకున్న ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. హెలికాప్టర్ ట్యాక్సీలో సంచరించే ప్రతి ప్రతిప్రయాణికుడు టిక్కెట్ ధర రూ. 4,100 (రూ. 3,500+జీఎస్ టీ) చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులతో పాటు 15 కేజీల లగేజీని హెలికాప్టర్ ట్యాక్సీలో తరలించడానికి అవకాశం కల్పించారు.
ప్రస్తుతం అమలులో ఉన్న లగ్జీరీ ట్యాక్సీ కార్లకు రూ. 1,500 నుంచి రూ. 2,500 వేలు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన హెలికాప్టర్ ట్యాక్సీలకు క్యాబ్ ధరల కంటే రెండింతలు ఎక్కవ ఉన్నా వెనకాడడం లేదు .ఇప్పటికే అనేక మంది హెలికాప్టర్ ట్యాక్సీలలో వారి సీట్లు బుక్ చేసుకున్నారు. బెల్ 407 హెలికాప్టర్ టాక్సీ సేవలు బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం- ఎలక్ట్రానిక్ సిటీ- హెచ్ఏఎల్ మార్గాల్లో సంచరిస్తున్నాయి. ప్రతి రోజు ఉదయం 6.30 నుంచి ఉదయం 9.30 గంటల వరకు, మద్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు బెల్ 407 కంపెనీకి చెందిన రెండు హెలికాప్టర్ ట్యాక్సీలు సంచరిస్తున్నాయి.