యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రగతి భవన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌ల సమావేశం ముగిసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని ఉమ్మడి అంశాలపై ఇరువురి మధ్య చర్చించారు. వివాదాస్పద అంశాలు, నదీ జలాల పంపకం తదితర అంశాలతో పాటు గోదావరి జలాల సద్వినియోగం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.. గోదావరి మిగులు జలాలను కృష్ణా నదికి మళ్లించేందుకు ఉన్న అవకాశాలపై కుడా చర్చించారు. తెలంగాణ, ఏపీ రెండు వేర్వేరు అనే భావన తమకు లేదని ఇరువురు సీఎంలు స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువ ఉన్నందున గోదావరి నీటిని తరలించాలని నిర్ణయించారు. గోదావరి జలాలను శ్రీశైలంలోకి తరలించే ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఇరువురు సీఎంలు ఆదేశించారు. రెండు తెలుగు రాష్ర్టాలు పచ్చగా కళకళలాడాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా, గోదావరిలో నీటి లభ్యతపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలుగు రాష్ర్టాల్లోని ప్రతి మూలకు సాగు, తాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ అన్నారు. సాగు, తాగునీటికి, పరిశ్రమలకు నీటి కొరత రాకుండా చూడాలి. నదీ జలాల వివాదాలను ఏకాభిప్రాయంతో త్వరగా పరిష్కరించుకోవాలి. వివాదాలే కొనసాగిస్తే మరో తరానికి కూడా మనం నీళ్లు ఇవ్వలేం. తెలంగాణ, ఏపీ సంబంధాల్లో ఇప్పుడు గుణాత్మక మార్పు వచ్చింది. ఏపీ సీఎం జగన్ స్వచ్ఛమైన హృదయంతో వ్యవహరించారు. మహారాష్ట్రతోనూ సయోధ్య ఉండడంతో కాళేశ్వరం నిర్మించుకోగలిగాం. తక్కువ ఖర్చుతో రెండు రాష్ర్టాలకు కావాల్సిన నీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తాం. గోదావరి, కృష్ణాలో కలిపి 4 వేల టీఎంసీల నీటి లభ్యత ఉంది. అందుబాటులోని నీళ్లతో రెండు రాష్ర్టాలను సుభిక్షం చేయొచ్చు. గోదావరిలో ఏటా 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. నీళ్ల కోసం ట్రైబ్యునల్, కోర్టుల చుట్టూ తిరిగితే ప్రయోజనం లేదు. కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం అనే ప్రతిపాదన చేస్తోంది. మన అవసరాలు తీరాకే కేంద్రం ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవచ్చు. గోదావరి నీటిని శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు తరలిస్తే ఇరు రాష్ర్టాలకు మేలు జరుగుతుంది. రాయలసీమ, పాలమూరు, నల్లగొండ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు బాగుపడుతాయి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.